Sunday, August 25, 2013

ఇందిర || గజల్ ||





ఏది ఏది ఎక్కడుంది స్త్రీ జాతికి రక్షణ?
గంగలోన కలుస్తోంది నరజాతి విచక్షణ

తల్లి ఎపుడు రంగరించు ఉగ్గుపాల ప్రేమనే
మరిఏడ నేర్చినాడో ఈ మాన ప్రాణ భక్షణ

సృష్టిలోన మహోన్నతుడు మనిషేకద ఇందిర
ఇపుడే జంతువులివ్వాలో విలువలకై శిక్షణ ?

కురుసభలో దించుకున్నతలలు ఎత్తలేదింకా
మనుషులుగా పరిగణించు రోజుకై నిరీక్షణ

25-08-2013

Friday, August 16, 2013

ఇందిర*గజల్- గీతిక




ఐక్యతయే వర్థిల్లితె లోకమంత నందనమే
ఓ ఇందిర నీగజలిక మానవతకు వందనమే

ఆదినుండి సాధించిన నాగరికత ఫలరూపమె\
విశ్వమంత గెలవాలని ఉరకలేయు ఇంధనమే

ఎంతమథన పశుతవీడి మనిషినోట మాటలూరి\
సుధలనొలుకు జిలుగుపలుకు మనల కలుపు బంధనమే

గుహలు వీడి ఊహపెరిగి ఊరువాడ రూపుదాల్చ
నీతినియమ సామాజిక చేతనంత చందనమే

గిరులైనా ఝరులైనా తరువులైన వరాలొసగ
 సిరులుపండె ఈనేలే నీపాలిట కుందనమే


*** (తెలియదని కాదుగానీ ఒకమాట...గజల్ లో మొదటి పంక్తి నుండి(మిశ్రా) చివరి పంక్తి వరకు ఒకే మాత్రానియతి ఉంటుంది.అంటే అన్ని షేర్లూ సమాన సౌష్టవాన్ని కలిగి ఉంటాయన్నమాట .అందుకే గానయోగ్యత కలిగిఉంటుంది. మరో ప్రత్యేకత_ఏ షేరుకాషేరు స్వతంత్రంగా ఉంటాయి.అంటే ఒకోషేర్ లో ఒకో విషయం ఉండొచ్చు.ఇవి తెలియని వారికోసమేనని మనవి)