Saturday, March 22, 2014

పని ఏమిటి - Abd Wahed



ప్రశ్నలే లేనప్పుడు జవాబుతో పని ఏమిటి
దారులే లేనప్పుడు గమ్యంతో పని ఏమిటి

ముక్కలై పోయినపుడు కంటిలోని అలలన్నీ
చెంపపై జారుతున్న నవ్వులతో పని ఏమిటి

చుక్కలను సిగపూలుగ తురుముకున్న రాత్రుల్లో
చీకటే నెచ్చెలియ వెలుగులతో పని ఏమిటి

పల్చనై పోతుంటే అనురాగం మనసుల్లో
మౌనమే బాగున్నది రాగాలతో పని ఏమిటి

గుండెలో ఇరుకైతే ఉండాలా అందులోనె
ప్రాణమే గడ్డకడితె నెత్తుటితో పని ఏమిటి

పూలపై పేరుకున్న మంచులోని సుగంధాలు
గాలిలో లేనప్పుడు ఊపిరితో పని ఏమిటి

మంచులా కరుగుతున్న దారుల్లో జారుతుంటె
పచ్చిగా మొలకెత్తే ప్రేమలతో పని ఏమిటి

Thursday, March 20, 2014

|| జ్యోతిర్మయి మళ్ళ || గజల్



మనసునేలు మాధవుడిని తలవాలని ఉండదా
ప్రాణమిచ్చు ప్రేమికుడిని కలవాలని ఉండదా

మెరుపుతీగవంటు నన్ను మురిపెముగా పిలిచితే
మురిసిపోతు చెంతచేరి నిలవాలని ఉండదా

తమలపాకులంటు కళ్ళకద్దుకుంటె పదములు
ధన్యములై చేతులెత్తి కొలవాలని ఉండదా

అమృతమంటు మధువు అంటు అధరముల పొగిడితే
పరవశించి పెదవి విప్పి పిలవాలని ఉండదా

నవ్వుముఖము దుఃఖములకు ఔషధమని తలచితే
సర్వమోడియైన నువ్వే గెలవాలని ఉండదా

ముద్దబంతివి పూలరెమ్మవి జాబిలి నీవంటుంటే
మరలమరల ఈ నేలనే మొలవాలని ఉండదా

(20-3-14)

Wednesday, March 19, 2014

ఆశ Abd Wahed



గగనాన్నే పట్టుకుని ఇంటిలోన పెంచుకునే ఆశా
రహదారిని చేయిపట్టి మనతోనే ఉంచుకునే ఆశా
ప్రయాణమే ముఖ్యమైతె గమ్యంతో పనేలేదు మనకూ
మనలోపలి దారుల్లో దూరాలను దాటుకునే ఆశా
నీడలాగ పెరుగుతున్న వయసులోని చీకట్లను చూసీ
చిన్నప్పటి చిరుదీపం వెలుగులనే దాచుకునే ఆశా
రాత్రిపగలు గోడల్లో పునాదిగా నిలబడడం మానీ
రెక్కవిప్పి కాలంతో వేగాన్నే పంచుకునే ఆశా
నెత్తుటిలో ప్రతిబొట్టూ నిప్పురవ్వగా మారేదెపుడో
ఎండుగడ్డి దేహంలో మంటలు రగిలించుకునే ఆశా
దారిలోన దోపిడైన సాహసాల సంపదలను వెదికీ
మరోసారి ప్రమాదాన్ని వెదికిమరీ పట్టుకునే ఆశా
చింతిస్తే లాభమేమి లోపాలను తలచి వగచి వగచీ
లోటుపాట్లు బలాలుగా దియామనం మార్చుకునే ఆశ
Top of Form

Wednesday, March 12, 2014

పచ్చికేదో మొలిచింది-Abd Wahed



గుండెనేల సరికొత్తగ పచ్చికేదో మొలిచింది
చిరుగాలే తొలకరినీ ఆత్రంగా పిలిచింది

ఎండల్లో నీడలను వెదుకుతున్న సెలయేరు
గట్టుచేయి పట్టుకుని ప్రాణంగా వలిచింది

గోడమీద చిరునవ్వుల మాట్లాడని చిత్రమే
కంటిలోన కలల ఇంటి పునాదిగా నిలిచింది

పెనుచీకటి భావాలను తొలికిరణం ఛేదించి
రాతిశిలను స్వచ్ఛమైన అద్దంలా మలిచింది

ఏకాంతం గూటిలోన పక్షిలాంటి జ్ఙాపకం
చెట్టులాంటి మౌనాన్నే మాటలుగా తొలిచింది

వెన్నెలనే దుప్పటిగా కప్పుకున్న తోటలో
మంచులాంటి దియాతలపు పూలమనసు గెలిచింది

Monday, March 3, 2014

చూద్దామా-Abd Wahed- గజల్


అలల కంటిలో కమ్మనికలగా మారి చూద్దామా
గుండెలోతులో వలపులవలగా జారి చూద్దామా

కనురెప్పలపై ఎదురుచూపులే దీపాలైతే
ముళ్ళబాటపై పాతనవ్వులను ఏరి చూద్దామా

నీవు నీవుగా నేను నేనుగా బతుకుతు ఉన్నా
ఎడబాటు ఎండలో కాస్తనీడను వెదికి చూద్దామా

మంచుపొరల్లో ఇసుకరేణువులు ముత్యాలేగా
రాతిమనసుపై చూపుల దుప్పటి పరచి చూద్దామా

ఎదలోతుల్లో వెచ్చని ఊపిరి వేడిసెగలతో
హృదయసీమలో చలిచీకట్లను తరిమి చూద్దామా

Sunday, March 2, 2014

అన్ని వేదములోనె ఉన్నవి.....


దేహయంత్రములోని తంత్రము, దేహికైనా తెలియునా !
సారథిని రథమే నడుపు వైనం, దారికైనా తెలియునా !

వేదములు, మహిమలు, మతము ఉనికికి మూలమన్నది అసత్యం,
మృత్యు భయమే మూలమని, ఆస్తిక వాదికైనా తెలియునా !

అన్ని వేదములోనె ఉన్నవి, కాని గతి అప్రాచ్యమే !
కులభేదమే మన సృష్టి, చతుర్వేదికైనా తెలియునా !

దేవునికి, మనిషికి నడుమ వారథిలోనె కలదు కుతంత్రము !
స్వరము తప్పని మంత్ర భావం, పూజారికైనా తెలియునా !

ఒక్క భాషే ఎరుగు దేవుడు, సర్వ సృష్టికి మూలమా !
భూసురుల వంచన, పచ్చి హిందూ వాదికైనా తెలియునా !

వేయి పడగల నాగరాజులు, విషము చిమ్ముటె ధర్మము !
ఆ శేష శయనుని కరుణ ఇది, బహుజనులకైనా తెలియునా !

అమానుషమ్మగు దోపిడీకే, కులపు నిచ్చెన నీతులు !
ఇన్ని వ్యూహపు చతురతలు, ఏజాతికైనా తెలియునా !

'దైవ' భాషను వదలి, విప్రులె మ్లేచ్ఛ భాషలు నేర్చినారు,
'స్వధర్మ' మంటే ఏమిటో, గాయత్రికైనా తెలియునా !

***************




"శిశిర వల్లకి" (2012) గజళ్ళ సంపుటి నుంచి...