Wednesday, March 12, 2014

పచ్చికేదో మొలిచింది-Abd Wahed



గుండెనేల సరికొత్తగ పచ్చికేదో మొలిచింది
చిరుగాలే తొలకరినీ ఆత్రంగా పిలిచింది

ఎండల్లో నీడలను వెదుకుతున్న సెలయేరు
గట్టుచేయి పట్టుకుని ప్రాణంగా వలిచింది

గోడమీద చిరునవ్వుల మాట్లాడని చిత్రమే
కంటిలోన కలల ఇంటి పునాదిగా నిలిచింది

పెనుచీకటి భావాలను తొలికిరణం ఛేదించి
రాతిశిలను స్వచ్ఛమైన అద్దంలా మలిచింది

ఏకాంతం గూటిలోన పక్షిలాంటి జ్ఙాపకం
చెట్టులాంటి మౌనాన్నే మాటలుగా తొలిచింది

వెన్నెలనే దుప్పటిగా కప్పుకున్న తోటలో
మంచులాంటి దియాతలపు పూలమనసు గెలిచింది

Monday, March 3, 2014

చూద్దామా-Abd Wahed- గజల్


అలల కంటిలో కమ్మనికలగా మారి చూద్దామా
గుండెలోతులో వలపులవలగా జారి చూద్దామా

కనురెప్పలపై ఎదురుచూపులే దీపాలైతే
ముళ్ళబాటపై పాతనవ్వులను ఏరి చూద్దామా

నీవు నీవుగా నేను నేనుగా బతుకుతు ఉన్నా
ఎడబాటు ఎండలో కాస్తనీడను వెదికి చూద్దామా

మంచుపొరల్లో ఇసుకరేణువులు ముత్యాలేగా
రాతిమనసుపై చూపుల దుప్పటి పరచి చూద్దామా

ఎదలోతుల్లో వెచ్చని ఊపిరి వేడిసెగలతో
హృదయసీమలో చలిచీకట్లను తరిమి చూద్దామా

Sunday, March 2, 2014

అన్ని వేదములోనె ఉన్నవి.....


దేహయంత్రములోని తంత్రము, దేహికైనా తెలియునా !
సారథిని రథమే నడుపు వైనం, దారికైనా తెలియునా !

వేదములు, మహిమలు, మతము ఉనికికి మూలమన్నది అసత్యం,
మృత్యు భయమే మూలమని, ఆస్తిక వాదికైనా తెలియునా !

అన్ని వేదములోనె ఉన్నవి, కాని గతి అప్రాచ్యమే !
కులభేదమే మన సృష్టి, చతుర్వేదికైనా తెలియునా !

దేవునికి, మనిషికి నడుమ వారథిలోనె కలదు కుతంత్రము !
స్వరము తప్పని మంత్ర భావం, పూజారికైనా తెలియునా !

ఒక్క భాషే ఎరుగు దేవుడు, సర్వ సృష్టికి మూలమా !
భూసురుల వంచన, పచ్చి హిందూ వాదికైనా తెలియునా !

వేయి పడగల నాగరాజులు, విషము చిమ్ముటె ధర్మము !
ఆ శేష శయనుని కరుణ ఇది, బహుజనులకైనా తెలియునా !

అమానుషమ్మగు దోపిడీకే, కులపు నిచ్చెన నీతులు !
ఇన్ని వ్యూహపు చతురతలు, ఏజాతికైనా తెలియునా !

'దైవ' భాషను వదలి, విప్రులె మ్లేచ్ఛ భాషలు నేర్చినారు,
'స్వధర్మ' మంటే ఏమిటో, గాయత్రికైనా తెలియునా !

***************




"శిశిర వల్లకి" (2012) గజళ్ళ సంపుటి నుంచి...

Monday, February 17, 2014

వేరే ఉంది - గజల్ - Abd Wahed

మనసు దూదిలా తేలిపోవడమే కాదు వేరే ఉంది
బతుకు హాయిగా గడిచిపోవడమే కాదు వేరే ఉంది

నా కన్నీటిని నీ కనుచూపుతో తుడవాలనుకున్నా
నా చూపుల్లో కాలిపోవడమే కాదు వేరే ఉంది

ప్రేమశిఖరాల పైకెగబ్రాకినా నిలబడాలని లేదా
సుమగంధాలు రాలిపోవడమే కాదు వేరే ఉందీ

చేతికి దొరకక అద్దంలోతులో కనిపిస్తూ ఉన్నా
ప్రతిబింబాలు పారిపోవడమే కాదు వేరే ఉంది

వలపుతలపులే లోకంగా మారిపోతే నీ లోనా
ప్రేమమత్తుగా వాలిపోవడమే కాదు వేరే ఉంది

కురుల నీడలో చెంపలవెలుగులో నిశ్చింతలు భ్రమలే
గుండెఎండలో మండిపోవడమే కాదు వేరే ఉంది

ఆకలిదప్పుల తీరాల మధ్యన ప్రవహించే నదిలో
ప్రేమగా దియా మునిగిపోవడమే కాదు వేరే ఉంది

Wednesday, February 12, 2014

గజల్ - Abd Wahed


తమలపాకు పాదాలపై తుమ్మెదలా చూపులన్ని వాలుతూనే ఉన్నవి
మనసులోని మాటలన్ని గట్టుతెగిన ఏరులాగే ఉరుకుతూనే ఉన్నవి

మొలకెత్తిన జ్ఙాపకాల కంటితేమ మంచులాగ గడ్డకట్టి భద్రంగా
దాచుకున్న చందమామ నవ్వులన్ని వెన్నలాగ కరుగుతూనే ఉన్నవి

తనసిగలో చీకట్లను తురుముకున్న రాత్రికన్య నుదుటిపైని జాబిలిని
చేయిచాచి సాగరాలు మనసులోని ఆశలాగ పిలుస్తూనే ఉన్నవి

ప్రాణాలను బలిపెడుతూ ఎగురుతున్న పురుగులనే తదేకంగ చూస్తున్న
గుండెల్లో పొగచూరిన దివ్వెలన్నీ అసూయతో కాలుతూనే ఉన్నవి

చెట్టుకింద కూలబడిన నీడలాగ నడుంవిరిగి నినాదాలు కూర్చున్నా
ఎగరలేక పాకుతున్న ఏరులన్నీ కన్నీళ్ళను కార్చుతూనె ఉన్నవి

నానావిధ ఫిర్యాదుల గుట్టల్లో మేనుమరిచి నిదురిస్తూ హాయిగా
తోటలోని పిట్టలన్ని గుట్టుగానె బతుకుబండి నెట్టుతూనె ఉన్నవి

చలిగాలి విసనకర్ర చేతబట్టి మల్లెపొదల వేడిసెగల నార్పినా
మట్టిలోన సువాసనల చినుకులేవొ రగులుతూనె ఉన్నవి

Tuesday, January 28, 2014

గజల్ - Abd Wahed

NTR గారికోసం Abd Wahed గారు ప్రత్యేకంగా రాసిన గజల్
* * *


ముత్యంలాంటి మనిషివినీవే సత్యంలా వెలిగావు
విలువలకొరకు పదవిని వదిలి ఆదర్శంగా వెలిగావు

రాముడివైనా కృష్ణుడివైనా నీవేగా రామయ్యా
నీరూపాన్నే దైవమనుకొనే అవతారంలా వెలిగావు

వెండితెరపైనా వెలుగులవానై మనసుల్లో కురిసావు
నటసార్వభౌమా ప్రతిభకు నీవే ప్రతిరూపంలా వెలిగావు

కూడూగూడూ లేని పేదలకు అండదండగా నిలిచావు
రెండ్రూపాయల బియ్యంతోనువు అన్నదాతలా వెలిగావు

గాంధీచెప్పినమద్యనిషేధం మర్చేపోయిన కాలంలో
మద్యంపీడను విరగడ చేసిన నవగాంధీలా వెలిగావు

ఆకాశంలో సగభాగానికి ఆస్థిలో కూడా సగముంది
వనితలబ్రతుకులొ చీకటి తరిమిన మణిదీపంలా వెలిగావు

పరిపాలనను ప్రజలవద్దకు పంపినవాడివి నీవేగా
ఋషితుల్యుడివి జీవితమంతా ప్రయోజనంలా వెలిగావు

అవినీతెరుగని రాజనీతికి చిరునామావై బ్రతికావు
పరువుప్రతిష్టల తెలుగుజాతికి ఘనచిహ్నంలా వెలిగావు

Thursday, November 21, 2013

ప్రతి రేయి చితిలా......Shivaramakrishna Penna,



         

ఎందుకో! ప్రతి రేయి చితిలా రగులుతూనేఉన్నది !
స్మృతుల గంధపు చెక్కలా మది కాలుతూనే ఉన్నది !

ఎపటికప్పుడు శిశిర వృక్షము లాగ 'పెన్నా' నిలిచినా,
ఒక స్వప్నమేదో బతుకుతో కలహించుతూనే ఉన్నది !

మనసు నిత్యం దేహమునకు పరీక్షలెన్నో పెట్టినా,
గయ్యాళి మదితో దేహమింకా వేగుతూనే ఉన్నది !

మబ్బు చాటున దాగి, జాబిలి దోబూచులాడుతు ఉన్ననూ,
నింగి తారల కొంగు, నను చుంబించుతూనే ఉన్నది !

దేనికీ దుఃఖించ నంటూ బీరాలు పలికే వేలనోయీ!
గుండె మాటున అశ్రువూ విలపించుతూనే ఉన్నది !

పక్షి వెతలను చూడగా, తన బంధనాలూ తెలిసెను !
పంజరము కూడా రెక్కలను ఆశించుతూనే ఉన్నది !

సూర్య చంద్రులు కూడ ముక్తిని కోరితే ఫలముండునా!
లోలకంలా భాను బింబం ఊగుతూనే ఉన్నది !

ఇద్దరము ఇరు దిగంతాలుగ నిలిచినా వగపెందుకు?
ఇంద్ర చాపము లాగ, గజలే కలుపుతూనే ఉన్నది !

----16.11.2013