Thursday, May 1, 2014

కె.కె.// ప్రేమ-గజల్//



కాదని అనగలనా...తనప్రేమే నడిపిస్తోందంటే,
కాదని అనగలనా... ఎడబాటే వేధిస్తోందంటే

చెంతలేకున్నా, వలపు సంకెలేసిందేమో,
కాదని అనగలనా... చెలిరూపం ఛేదిస్తోందంటే

ఏ మంత్రమున్నదో ఏమో... మతిపోయి తిరుగుతున్నాలే,
కాదని అనగలనా... చిరునవ్వే ఆడిస్తోందంటే

కొమ్మలూగుతున్నా, పలకరింపు లాగున్నాదే
కాదని అనగలనా... చెలిఊహే లాలిస్తోందంటే

గుండె సవ్వడైనా, కొండ పేల్చినట్టుందే,
కాదని అనగలనా... తన మౌనం కాలుస్తోందంటే

ఎదురుచూపులెన్నున్నా, గెలుపుంది 'కోదండ'
కాదని అనగలనా... నీ విరహం సుఖమేనంటుంటే
======Date: 14.02.2014
https://soundcloud.com/#kodanda-rao/love-is-divine


Wednesday, April 30, 2014

చల్లా గౙల్-11/ Dt.30-4-2014


ఉంగా ఉంగా బుల్లి పాటలు పాడుతున్నావా
అమ్మ కొంగుతో బూచి ఆటలు ఆడుతున్నావా

తల్లిపాలను త్రాగి ఆకలి తీరిందంటే
పువ్వుల్లాంటి బోసినవ్వులు రువ్వుతున్నావా

బొమ్మల పెళ్ళి చేసి ఆటపాటలతో అలసి
నాన్న కాళ్లపై తూగుటుయ్యాల ఊగుతున్నావా

అన్నమూపుపై చేరి గుర్రపు స్వారి చేసి
బొమ్మ కత్తితో బామ్మ మీదికి దూకుతున్నవా

చందమామను చూపి కావాలంటూ ఏడ్చి
తాతగారిని కోరికలెన్నోకోరుతున్నావా

ముద్దు మాటలు పలికే ఆ సందడి రాసే "చల్లా"
అందరి మదిలో అనుబంధాన్ని పెంచుతున్నావా

Friday, April 25, 2014

ఇంకా గుర్తుందిలే - గజల్ - జాన్ హైడ్ కనుమూరి



అలా అలా దాగిన జలతారు పరదాలచాటు ఇంకా  గుర్తుందిలే
గల గలా సాగిన నవ్వులతీరు పూలైనచోటు ఇంకా గుర్తుందిలే

నీకై నిరీక్షించి నిరీక్షించిన ఆ సాయంకాలం
కనులెదుటే మెరుపులా వచ్చిపోయిన జాడ ఇంకా గుర్తుందిలే!

పరాకుగా విదిల్చిన మాటకు నొచ్చుకున్నావో లేదో
ప్రక్కకు తిరిగి గిర్రున రాల్చిన ముత్యపుబొట్టు ఇంకా  గుర్తుందిలే !

చిగురుతొడిగిన మొగ్గ సిగ్గులొలికిన నా బుగ్గ 
అందానికే అందమని చదివిన ఆనాటి కవిత ఇంకా గుర్తుందిలే!

గుబులుపెట్టిన ఆ నీలిమేఘం భళ్ళున రాలితే 
చెట్టునీడలో ఒదిగి ఒదిగి తడిన ఆ వాన ఇంకా  గుర్తుందిలే!  

బాటసారినై అలసి నీ గుమ్మాన దాహమడిగితే  
చిరునవ్వుల కూ'జాను'ఒంపి తడిపిన తీరు ఇంకా  గుర్తుందిలే !


**********25.4.2014

Sunday, April 20, 2014

ఆశ - చల్లా గజల్



పూల సొగసు చూడాలని తోటకి ఆశ
ప్రేమరుచులు పంచాలని తేటికి ఆశ

కమ్మనైన రాగాలు వీచికలైతే
వీనులకు సొకాలని పాటకి ఆశ

ఇజాలన్నీ పోటీపడి భాషణలిస్తే
నిజం లోనే ఒదగాలని మాటకి ఆశ

వేసిన ప్రతి అడుగూ మంచికోసమైతే
పాదాలను తాకాలని బాటకి ఆశ

ఖరీదైన నైవేద్యాలెందుకోయి "చల్లా"
దైవస్మరణ చేయాలని నోటికి ఆశ


Thursday, April 17, 2014

ఆ వెన్నెల...కన్నెగంటి వెంకటయ్య -గజల్



ఆ వెన్నెల వెలుగును చూసి ఎంతగా మురిసిపోతిని..!?
ఈ వన్నెల తెలుగును చూసి అంతగా మురిసిపోతిని..!!
//ఆ వెన్నెల//

తెలుగు చంద్రకళలను సాంతం పరభాషా రాహువు పట్టి
నమిలి మింగె తీరును చూసి ఎంతగా కుమిలి పోతిని.
//ఆ వెన్నెల//

సహజ తెలుగు వెన్నెల ముందు కృత్రిమ వెలుగులు నిలబడవని
గ్రహించని ద్రోహుల చూసి ఎంతగా రగిలి పోతిని.
//ఆ వెన్నెల//

తెలుగు జాబిలమ్మకు భయపడి పరభాషాచీకటి తొలిగి
రాబోయే జిలుగును చూసి ఎంతగా ఆశపడితిని.
//ఆ వెన్నెల//

తెలుగు సూర్యపుత్రుల కాంతి తెలుగు చందమామ సజీవం
కన్నెగంటి కన్నుల చూసి ఎంతగా హర్షించితిని.
//ఆ వెన్నెల//

17.4.14.

చల్లా గజల్


ఎక్కడో చిరుజల్లు పడితే ఇక్కడెందుకు గొడుగు పడతావు
ఎక్కడో పారేటి నీటికి ఇక్కడెందుకు చాల్లు కడతావు

గాయమొకరికి వైద్యమొకరికి రోగమెప్పుడు కుదుట పడును
మనసుకే అవినీతి కుడితే మనిషికెందుకు మందు పడతావు

సొమ్ము ఒకడిది షొకు ఒకడిది దేశమెప్పుడు బాగుపడును
పొరుగునే పూరిళ్ళు ఉన్నా పరులకెందుకు మేడ కడతావు

బాధలొకరివి భాగ్యమొకరిది సమత మమతలు ఎక్కడున్నవి
ఆకలంటూ ఆర్తినొందే వారికెందుకు కడుపు కొడతావు

కలం ఒకరిది కవిత ఒకరిది మొసమైనా ఓయి "చల్లా"
కీర్తికోసం ఎన్ని జిత్తులో తెలిసి ఎందుకు బాధపడతావు

17.4.2014

Saturday, March 22, 2014

పని ఏమిటి - Abd Wahed



ప్రశ్నలే లేనప్పుడు జవాబుతో పని ఏమిటి
దారులే లేనప్పుడు గమ్యంతో పని ఏమిటి

ముక్కలై పోయినపుడు కంటిలోని అలలన్నీ
చెంపపై జారుతున్న నవ్వులతో పని ఏమిటి

చుక్కలను సిగపూలుగ తురుముకున్న రాత్రుల్లో
చీకటే నెచ్చెలియ వెలుగులతో పని ఏమిటి

పల్చనై పోతుంటే అనురాగం మనసుల్లో
మౌనమే బాగున్నది రాగాలతో పని ఏమిటి

గుండెలో ఇరుకైతే ఉండాలా అందులోనె
ప్రాణమే గడ్డకడితె నెత్తుటితో పని ఏమిటి

పూలపై పేరుకున్న మంచులోని సుగంధాలు
గాలిలో లేనప్పుడు ఊపిరితో పని ఏమిటి

మంచులా కరుగుతున్న దారుల్లో జారుతుంటె
పచ్చిగా మొలకెత్తే ప్రేమలతో పని ఏమిటి