Showing posts with label ఎలామరవడం!. Show all posts
Showing posts with label ఎలామరవడం!. Show all posts

Saturday, June 8, 2013

ఎలామరవడం!

తనువంతా మేఘమై తడిపిన కాలాన్ని ఎలామరవడం!
జ్ఞాపకమైన రాగమేదో పదేపదే వినబడితే ఎలామరవడం!

కరుణించే కన్నుల్లో కదలిసాగిన అలలన్నీ
కాగితపు పడవలైన బాల్యపు అడుగులన్నీ ఎలామరవడం!

వల్లప్పల పాటలలో కలిసి ఆడిన స్నేహహస్తం
సవ్వడిచేసే గానమై వెనువెంటే రావడం ఎలామరవడం!

చిరుజల్లులలో ఏరిన ముత్యాల చినుకులు
చెలిచెక్కిలిపై నడయాడి మెరవడం ఎలామరవడం!

సంధ్యకెదురైన చుట్టం వాలుసంధ్యలో వర్షం
రాత్రి విడువని జ్ఞాపకమై వేకువకెటోవెళ్తే ఎలామరవడం!

తడిపొడి చినుకుల్లో తడబడు అడుగుల్తో
కదిలే పాలరాతి శిల్పాన్ని మరిపించడం ఎలామరవడం!

ఉరిమిన ఉరుములలో భయపెట్టిన జాడలు

ఎదిగిన వయసునేర్పిన ధైర్యపు మూటలు  ఎలామరవడం!

కలలాగా సాగిన మబ్బులవెంట పయననం
‘జాను’పాడేగీతికల్లో మురిసిన అనుభవాన్ని ఎలామరవడం!


.............................................జాన్ హైడ్ కనుమూరి 
http://koumudi.net/Monthly/2013/may/index.html