Showing posts with label నాలోపల-Abd Wahed. Show all posts
Showing posts with label నాలోపల-Abd Wahed. Show all posts

Tuesday, November 19, 2013

నాలోపల-Abd Wahed

మనసెందుకో ఈరోజిలా ఆరిపోయింది నాలోపల
చీకట్లలో ఒకరాత్రిలా జారిపోయింది నాలోపల

ఈగాలిలో ఉండాలిగా స్వరచిత్రాలతో ఒకవెన్నెల
ఆకాశాలలో జాబిల్లిగా మారిపోయింది నాలోపల

ఏకాంతాలలో నిర్వేదనా మరుభూమిలో ఒక రోదనా
చిరుజల్లులా మురిపాలతో వెలిసిపోయింది నా లోపల

గాయాలలో దాచేసినా మనోభావాల సిరి సంపదా
ఒక జ్ఙాపకం కన్నీరుగా కురిసిపోయింది నా లోపల

వినువీధిలో ఏకాకిగా తిరుగుతున్నాడు ఆ చంద్రుడు
ఆ వెన్నెలే నీ మాటగా మురిసిపోయింది నా లోపల

బంధాలలో నిర్విర్యమే అనుబంధాల సంవేదన
పెనుఘోషలో మది కెరటమే అలిసిపోయింది నా లోపల

ప్రతి మౌనమూ ఒక రాగమే, అనర్ధాలకూ ఒక అర్ధమె
ఈ దీపమే చీకట్లవల విసిరిపోయింది నాలోపల