Showing posts with label కె. కె. - రాసిన గజల్. Show all posts
Showing posts with label కె. కె. - రాసిన గజల్. Show all posts

Thursday, May 1, 2014

కె.కె.// ప్రేమ-గజల్//



కాదని అనగలనా...తనప్రేమే నడిపిస్తోందంటే,
కాదని అనగలనా... ఎడబాటే వేధిస్తోందంటే

చెంతలేకున్నా, వలపు సంకెలేసిందేమో,
కాదని అనగలనా... చెలిరూపం ఛేదిస్తోందంటే

ఏ మంత్రమున్నదో ఏమో... మతిపోయి తిరుగుతున్నాలే,
కాదని అనగలనా... చిరునవ్వే ఆడిస్తోందంటే

కొమ్మలూగుతున్నా, పలకరింపు లాగున్నాదే
కాదని అనగలనా... చెలిఊహే లాలిస్తోందంటే

గుండె సవ్వడైనా, కొండ పేల్చినట్టుందే,
కాదని అనగలనా... తన మౌనం కాలుస్తోందంటే

ఎదురుచూపులెన్నున్నా, గెలుపుంది 'కోదండ'
కాదని అనగలనా... నీ విరహం సుఖమేనంటుంటే
======Date: 14.02.2014
https://soundcloud.com/#kodanda-rao/love-is-divine


Thursday, February 14, 2013

బోసినవ్వు - కె. కె - గజల్,


బోసినవ్వు విసురుతాడు, మంచు కురిసినట్లుగా,
చిన్నిముద్దు చిలుకుతాడు,మనసు తడిసినట్లుగా,

విరిగినవి, చిరిగినవి పారేస్తుంటే,
భద్రంగా దాస్తాడు, నిధులేవో దొరికినట్లుగా,

అరచేతిని ఆకుచేసి, అన్నం పెడుతుంటే,
నలుమూలల తిరుగుతాడు, తననెవరో తలచినట్లుగా,

ముద్దు,ముద్దు మాటలతో కధలే చెబుతుంటే,
ప్రశ్నలెన్నో అడుగుతాడు, నా మనసే అలసినట్లుగా,

నా చేతిని ఊతచేసి, నడిపిస్తుంటే,
పరుగులు పెడుతుంటాడు, జగమంతా గెలిచినట్లుగా,

అందమైన అల్లరితో అలరిస్తుంటే,
కలుసుకో కోదండ, నీ బాల్యం పిలిచినట్లుగా 

Monday, August 20, 2012

కోదండరావు - గజల్




ఏ నాటకమైనా ముగిసిందా ఏదో వాదన లేకుండా!!!
ఏ జీవితమైనా గడిచిందా ఏదో వేదన లేకుండా!!!

కలల్లోనే గడిపేస్తుంటే.. కీర్తిశిఖరం అందుతుందా
ఏ దేశమైన పురోగమించిందా ఏదో సాధన లేకుండా!!!

నీళ్ళైనా నిలకడగుంటే.. రాళ్ళల్లో నాచు మొలవదా
ఏ ధర్మమైన జన్మించిందా ఏదో శోధన లేకుండా!!!

యంత్రం ఎంత గొప్పదైనా... తానుగా నడవదులే
ఏ పాపడైనా పుడతాడా ఏదో దీవెన లేకుండా!!!

జాబిల్లి వెన్నెల చల్లితే...కలువ మురియదా "కోదండ"
ఏ మనసైనా ప్రేమిస్తుందా ఏదో స్పందన లేకుండా!!!

Wednesday, July 25, 2012

కె. కె. - రాసిన గజల్

ఒక పెద్దాయన షష్టిపూర్తి సంధర్బంగా నేను రాసిన గజల్ ఇక్కడ మీ కోసం...
****

పెళ్ళీనాటి జ్ఞాపకాల మల్లెలు, దాచుకో ఒక్కొక్కటే!
అందమైన అనుభవాల మువ్వలు, కూర్చుకో ఒక్కొక్కటే!!

ఊగే జుంకాలతో, విసిరే అరనవ్వుతో.. కళ్ళుచేసే బాసలెన్నో
పెళ్ళిచూపుల నాటి మాటలు, పంచుకో ఒక్కొక్కటే!!

ఆశీర్వచనాలతో, ఆనందపు నీళ్ళతో, కన్నవారి కళ్ళ కాంతులెన్నో
మార్చుకున్న తాంబూల గంధాలు, ఎద రాసుకో ఒక్కొక్కటే!!

తెరచాటు మాటున అరచేతులు ఉంచిన, అక్షింతల జల్లులెన్నో
మంత్రాలు ముడివేసిన ఘడియలు, తలుచుకో ఒక్కొక్కటే!!

అరమోడ్పు కన్నుల బిడియాల మాటలు, పూల మాటు గుస,గుసలెన్నో
పంచుకున్న తమలపాకు చిలకలు, నెమరేసుకో ఒక్కొక్కటే!!

ఆరుపదులు దాటినా కోదండ, ఆరని సుగంధమేలే ఈ ప్రేమ
మనసులు శృతిచేసుకున్న గీతాలు, పాడుకో ఒక్కొక్కటే!!