Showing posts with label Abd Wahed. Show all posts
Showing posts with label Abd Wahed. Show all posts

Sunday, August 17, 2014

తెలుగు గజల్ మిత్రులందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

~*~ 
Abd Wahed

స్వతంత్ర దినోత్సవం రోజున అల్లమా ఇక్బాల్ రాసిన సారే జహాం సే అచ్ఛా గేయాన్ని పోస్టు చేశాను. ఆ గేయంలో ఉర్దూ పదాలకు తెలుగు అర్ధాలు ఇవ్వాలని అనుకున్నాను. కాని చక్కని మీటర్ తో సాగుతున్న ఆ గేయాన్ని అదే శైలిలో అనువదిస్తే ఇంకా బాగుంటుందనిపించింది. కాని ఇక్బాల్ కవితలు అంత సులభంగా అనువాదానికి లొంగవు. నాక సాధ్యమైనంత వరకు ప్రయత్నించాను. మీటర్ అదే కొనసాగించడానికి, అదే నడకకు కట్టుబడడానికి వీలయినంత ప్రయత్నం చేశాను.
రష్కె జనాం అన్న పదానికి అర్ధం జీనీలు కూడా అసూయపడే అని. జీనీ అన్న ఇంగ్లీషు పదం నిజానికి జిన్ అన్న అరబీ పదం నుంచి వచ్చింది. అలాగే హిందీ అన్న పదానికి ఇక్కడ అర్ధం హిందూస్తాన్ దేశవాసి అని. హిందీ అన్న భాషను సూచించడానికి వాడిన పదం కాదు. ఇప్పటికి కూడా మధ్యప్రాచ్య దేశాల్లో భారతీయులందరినీ ఏ మతం వారినైనా హిందీ అనే పిలుస్తుంటారని విన్నాను. తెలుగులో ఈ పదం ఇలాగే వాడాలనుకున్నాను కాని హిందీ అన్న పదం వాడితే హిందీ భాషగా పొరబడే అవకాశం ఉంది. అందువల్ల హిందీ హై హమ్ వతన్ హై హిందూసితాం అన్న పంక్తిలో కాస్త స్వేచ్ఛ తీసుకున్నాను. అలాగే చివరి చరణంలో ముహర్రిమ్ అన్న పదానికి తెలుగులో సమానార్ధకం దొరకడం కష్టం. ఇంగ్లీషులో చొంఫిదంత్ అన్న పదం కొంత దగ్గరగా ఉంటుంది. అందువల్ల ఇక్కడ కూడా కాస్త స్వేచ్ఛ తీసుకున్నాను. ఇది అనువాదం కాకపోయినా అనుసృజన అనవచ్చుననుకుంటాను. ఎలా ఉందో చెప్పండి.
~*~
లోకంలొ మంచి దేశం, ఈ భారతం మనదీ
తుమ్మెదలు ఎగురుతున్నా, ఈ సుమవనం మనదీ

కడగండ్లు కమ్ముకున్నా, మనసంత దేశమేగా
మనసెక్కడైతె ఉందో, ఆ మండపం మనదీ

గగనంతొ మాటలాడే మనపర్వతాలు చూడూ
సరిహద్దు కాపు కాసే, ఆ హిమనగం మనదీ

వేలాది నదులు ఒడిలో ఆడే ఆటలెన్నో
పరులెంత ఈసుపడినా, ఈ నందనం మనదీ

ప్రవహించె గంగ నీకు, గుర్తుంద నాటి రోజూ
తీరాన దిగిన బృందం, ఆ జ్ఙాపకం మనదీ

మతమేదీ చెప్పలేదు, ద్వేషాన్ని పెంచవద్దు
మనమంత సోదరులం, ఈ మందిరం మనదీ

కాలంలొ కలిసిపోయాయ్, సామ్రాజ్యాలు ఎన్నో
ఇప్పటికి నిలిచి ఉన్నా, ఆ నిబ్బరం మనదీ

ఉందేదొ గొప్పదనమూ, తలవంచి మేమెరుగం
కాలంతొ కళ్ళు కలిపే, ఆ సాహసం మనదీ

లోకానికేమి తెలుసూ, దాగున్న గాయాలూ
తోడెవరు లేకున్న కొన సాగె గమనం మనదీ
 ~*~
సారే జహాం సె అచ్ఛా హిందూసితాం హమారా
హమ్ బుల్ బులేం హై ఇస్ కీ ఏ గుల్ సితాం హమారా

గుర్బత్ మేం హో అగర్ హమ్ రహతా హై దిల్ వతన్ మేం
సమజో వహీం హమేం భీ దిల్ హో జహాం హమారా

పర్బత్ వో సబ్ సే ఊంచా హమ్ సాయా ఆస్ మాం కా
వో సంతరీ హమారా, వో పాస్బాం హమారా

గోదీ మేం ఖేల్ తీ హై, ఇస్ కీ హజారోం నదియాం
గుల్షన్ హై జిన్ కే దమ్ సే రష్క్ జనాం హమారా

అయ్ ఆబె రూద్ గంగా వో దిన్ హై యాద్ తుఝ్ కో
ఉతరా తెరే కినారె జబ్ కార్వాం హమారా

మజ్హబ్ నహీం సిఖాతా ఆపస్ మేం బైర్ రఖనా
హిందీ హై హమ్, వతన్ హై హిందూసితాం హమారా

యూనానో మిస్రో రూమా సబ్ మిట్ గయే జహాం సే
అబ్ తక్ మగర్ హై బాకీ, నామో నిషాం హమారా

కుఛ్ బాత్ హై కె హస్తీ, మిటతీ నహీం హమారీ
సదియోం రహా హై దుష్మన్ దౌరె జమాం హామారా

ఇఖ్బాల్ కోయీ ముహర్రమ్ అప్నా నహీం జహాం మేం
మాలూమ్ క్యా కిసీ కో దర్ద్ నిహాం హమారా


http://picosong.com/cZvs/




Saturday, March 22, 2014

పని ఏమిటి - Abd Wahed



ప్రశ్నలే లేనప్పుడు జవాబుతో పని ఏమిటి
దారులే లేనప్పుడు గమ్యంతో పని ఏమిటి

ముక్కలై పోయినపుడు కంటిలోని అలలన్నీ
చెంపపై జారుతున్న నవ్వులతో పని ఏమిటి

చుక్కలను సిగపూలుగ తురుముకున్న రాత్రుల్లో
చీకటే నెచ్చెలియ వెలుగులతో పని ఏమిటి

పల్చనై పోతుంటే అనురాగం మనసుల్లో
మౌనమే బాగున్నది రాగాలతో పని ఏమిటి

గుండెలో ఇరుకైతే ఉండాలా అందులోనె
ప్రాణమే గడ్డకడితె నెత్తుటితో పని ఏమిటి

పూలపై పేరుకున్న మంచులోని సుగంధాలు
గాలిలో లేనప్పుడు ఊపిరితో పని ఏమిటి

మంచులా కరుగుతున్న దారుల్లో జారుతుంటె
పచ్చిగా మొలకెత్తే ప్రేమలతో పని ఏమిటి

Wednesday, March 19, 2014

ఆశ Abd Wahed



గగనాన్నే పట్టుకుని ఇంటిలోన పెంచుకునే ఆశా
రహదారిని చేయిపట్టి మనతోనే ఉంచుకునే ఆశా
ప్రయాణమే ముఖ్యమైతె గమ్యంతో పనేలేదు మనకూ
మనలోపలి దారుల్లో దూరాలను దాటుకునే ఆశా
నీడలాగ పెరుగుతున్న వయసులోని చీకట్లను చూసీ
చిన్నప్పటి చిరుదీపం వెలుగులనే దాచుకునే ఆశా
రాత్రిపగలు గోడల్లో పునాదిగా నిలబడడం మానీ
రెక్కవిప్పి కాలంతో వేగాన్నే పంచుకునే ఆశా
నెత్తుటిలో ప్రతిబొట్టూ నిప్పురవ్వగా మారేదెపుడో
ఎండుగడ్డి దేహంలో మంటలు రగిలించుకునే ఆశా
దారిలోన దోపిడైన సాహసాల సంపదలను వెదికీ
మరోసారి ప్రమాదాన్ని వెదికిమరీ పట్టుకునే ఆశా
చింతిస్తే లాభమేమి లోపాలను తలచి వగచి వగచీ
లోటుపాట్లు బలాలుగా దియామనం మార్చుకునే ఆశ
Top of Form

Wednesday, March 12, 2014

పచ్చికేదో మొలిచింది-Abd Wahed



గుండెనేల సరికొత్తగ పచ్చికేదో మొలిచింది
చిరుగాలే తొలకరినీ ఆత్రంగా పిలిచింది

ఎండల్లో నీడలను వెదుకుతున్న సెలయేరు
గట్టుచేయి పట్టుకుని ప్రాణంగా వలిచింది

గోడమీద చిరునవ్వుల మాట్లాడని చిత్రమే
కంటిలోన కలల ఇంటి పునాదిగా నిలిచింది

పెనుచీకటి భావాలను తొలికిరణం ఛేదించి
రాతిశిలను స్వచ్ఛమైన అద్దంలా మలిచింది

ఏకాంతం గూటిలోన పక్షిలాంటి జ్ఙాపకం
చెట్టులాంటి మౌనాన్నే మాటలుగా తొలిచింది

వెన్నెలనే దుప్పటిగా కప్పుకున్న తోటలో
మంచులాంటి దియాతలపు పూలమనసు గెలిచింది

Monday, March 3, 2014

చూద్దామా-Abd Wahed- గజల్


అలల కంటిలో కమ్మనికలగా మారి చూద్దామా
గుండెలోతులో వలపులవలగా జారి చూద్దామా

కనురెప్పలపై ఎదురుచూపులే దీపాలైతే
ముళ్ళబాటపై పాతనవ్వులను ఏరి చూద్దామా

నీవు నీవుగా నేను నేనుగా బతుకుతు ఉన్నా
ఎడబాటు ఎండలో కాస్తనీడను వెదికి చూద్దామా

మంచుపొరల్లో ఇసుకరేణువులు ముత్యాలేగా
రాతిమనసుపై చూపుల దుప్పటి పరచి చూద్దామా

ఎదలోతుల్లో వెచ్చని ఊపిరి వేడిసెగలతో
హృదయసీమలో చలిచీకట్లను తరిమి చూద్దామా

Monday, February 17, 2014

వేరే ఉంది - గజల్ - Abd Wahed

మనసు దూదిలా తేలిపోవడమే కాదు వేరే ఉంది
బతుకు హాయిగా గడిచిపోవడమే కాదు వేరే ఉంది

నా కన్నీటిని నీ కనుచూపుతో తుడవాలనుకున్నా
నా చూపుల్లో కాలిపోవడమే కాదు వేరే ఉంది

ప్రేమశిఖరాల పైకెగబ్రాకినా నిలబడాలని లేదా
సుమగంధాలు రాలిపోవడమే కాదు వేరే ఉందీ

చేతికి దొరకక అద్దంలోతులో కనిపిస్తూ ఉన్నా
ప్రతిబింబాలు పారిపోవడమే కాదు వేరే ఉంది

వలపుతలపులే లోకంగా మారిపోతే నీ లోనా
ప్రేమమత్తుగా వాలిపోవడమే కాదు వేరే ఉంది

కురుల నీడలో చెంపలవెలుగులో నిశ్చింతలు భ్రమలే
గుండెఎండలో మండిపోవడమే కాదు వేరే ఉంది

ఆకలిదప్పుల తీరాల మధ్యన ప్రవహించే నదిలో
ప్రేమగా దియా మునిగిపోవడమే కాదు వేరే ఉంది

Wednesday, February 12, 2014

గజల్ - Abd Wahed


తమలపాకు పాదాలపై తుమ్మెదలా చూపులన్ని వాలుతూనే ఉన్నవి
మనసులోని మాటలన్ని గట్టుతెగిన ఏరులాగే ఉరుకుతూనే ఉన్నవి

మొలకెత్తిన జ్ఙాపకాల కంటితేమ మంచులాగ గడ్డకట్టి భద్రంగా
దాచుకున్న చందమామ నవ్వులన్ని వెన్నలాగ కరుగుతూనే ఉన్నవి

తనసిగలో చీకట్లను తురుముకున్న రాత్రికన్య నుదుటిపైని జాబిలిని
చేయిచాచి సాగరాలు మనసులోని ఆశలాగ పిలుస్తూనే ఉన్నవి

ప్రాణాలను బలిపెడుతూ ఎగురుతున్న పురుగులనే తదేకంగ చూస్తున్న
గుండెల్లో పొగచూరిన దివ్వెలన్నీ అసూయతో కాలుతూనే ఉన్నవి

చెట్టుకింద కూలబడిన నీడలాగ నడుంవిరిగి నినాదాలు కూర్చున్నా
ఎగరలేక పాకుతున్న ఏరులన్నీ కన్నీళ్ళను కార్చుతూనె ఉన్నవి

నానావిధ ఫిర్యాదుల గుట్టల్లో మేనుమరిచి నిదురిస్తూ హాయిగా
తోటలోని పిట్టలన్ని గుట్టుగానె బతుకుబండి నెట్టుతూనె ఉన్నవి

చలిగాలి విసనకర్ర చేతబట్టి మల్లెపొదల వేడిసెగల నార్పినా
మట్టిలోన సువాసనల చినుకులేవొ రగులుతూనె ఉన్నవి

Tuesday, January 28, 2014

గజల్ - Abd Wahed

NTR గారికోసం Abd Wahed గారు ప్రత్యేకంగా రాసిన గజల్
* * *


ముత్యంలాంటి మనిషివినీవే సత్యంలా వెలిగావు
విలువలకొరకు పదవిని వదిలి ఆదర్శంగా వెలిగావు

రాముడివైనా కృష్ణుడివైనా నీవేగా రామయ్యా
నీరూపాన్నే దైవమనుకొనే అవతారంలా వెలిగావు

వెండితెరపైనా వెలుగులవానై మనసుల్లో కురిసావు
నటసార్వభౌమా ప్రతిభకు నీవే ప్రతిరూపంలా వెలిగావు

కూడూగూడూ లేని పేదలకు అండదండగా నిలిచావు
రెండ్రూపాయల బియ్యంతోనువు అన్నదాతలా వెలిగావు

గాంధీచెప్పినమద్యనిషేధం మర్చేపోయిన కాలంలో
మద్యంపీడను విరగడ చేసిన నవగాంధీలా వెలిగావు

ఆకాశంలో సగభాగానికి ఆస్థిలో కూడా సగముంది
వనితలబ్రతుకులొ చీకటి తరిమిన మణిదీపంలా వెలిగావు

పరిపాలనను ప్రజలవద్దకు పంపినవాడివి నీవేగా
ఋషితుల్యుడివి జీవితమంతా ప్రయోజనంలా వెలిగావు

అవినీతెరుగని రాజనీతికి చిరునామావై బ్రతికావు
పరువుప్రతిష్టల తెలుగుజాతికి ఘనచిహ్నంలా వెలిగావు