Sunday, June 10, 2012

మిత్రమా!!! - గజల్ కోదండ రావు గారి రచన


 ఈ గజల్ కోదండ రావు గారి రచన 
 వారి బ్లాగు నా కవిత

అందనిదేదో అందుతుందని అపేక్షించకు మిత్రమా!!!
అందినదాన్ని అందుకునేందుకు ఉపేక్షించకు మిత్రమా!!!

ఒరుసుకుందని రాళ్ళమద్యన ఏటిపయనం ఆగునా
దాతలకోసం చేతులుచాచి నిరీక్షించకు మిత్రమా!!!

సమ్మెటేస్తే బండరాయిలే ముక్కలవ్వక ఆగునా
మాటి,మాటికి మనసునైనా పరీక్షించకు మిత్రమా!!!

తాడుతోటి బిగించి లాగితే కొండకుదురులు వచ్చునా
ప్రజ్ఞలేని ప్రయత్నమెప్పుడు సుభీక్షించదు మిత్రమా!!!

చేదుగుళికలు ఎన్నిమింగిన చెదరకోయ్ 'కోదండ'
గడచిపోయిన పీడకలలను సమీక్షించకు మిత్రమా!!!
*****


వారి బ్లాగు 
http://www.naa-kavitha.blogspot.in/

Tuesday, April 3, 2012

నే ఓడిపోతుంటానులే! - గజల్


నిన్నే దాటిపోవాలని చేసే ప్రయత్నంలో నే ఓడిపోతుంటానులే!
నన్ను నడిపే నా నావికవని మరచి నే ఓడిపోతుంటానులే!

నా కనుసన్నలలో నడిపించి  అడుగులకు మడుగులొత్తే
జవదాటని  కొంగున ముడివేయాలని నే ఓడిపోతుంటానులే!

అనురాగానికి పదములల్లి  పలికే పలుకులెల్ల
నా అడుగు జాడలలో నడిపించాలని  నే ఓడిపోతుంటానులే!

ఎగబ్రాకే కొమ్మ రెమ్మలకు  జీవన వూతమైనిలిచి
శిఖరమెక్కిన చోట్ల   చిగురునవ్వాలని  నే ఓడిపోతుంటానులే!

నాకు నువ్వు నీకు నేననని తలపు మరచిన వేళ
 సహనపు చూపుల కొండనెదుర్కోలేక  నే ఓడిపోతుంటానులే!

నర్తించే పాదాలకు ఆంక్షల  సంకెళ్ళు వేయాలనుకుంటూ
కరుణనిండిన కౌగిలిలో కరిగి కరిగి  నే ఓడిపోతుంటానులే! 

కలిసి నడిచే  ఏడడుగుల్లో కలవని మాటలెన్నో
ఇమడ్చలేక సతమతమౌతూ నిరంతరం నే ఓడిపోతుంటానులే!

ఒకరినొకరు అధిగమించే ఆదిపత్యాల మధ్య
గెలుపు ఓటమి లేవని తెలుకోలేక నే ఓడిపోతుంటానులే!

ఏకమయ్యే  జాడమరచి నేను నువ్వని పెదవి విరచి
ఆజానుబాహువైన  నీ ప్రేమ ఎదుట  నే ఓడిపోతుంటానులే!



జాన్ హైడ్ కనుమూరి
-----------------------------------------------------------
27.03.2012 between 21.00 and 23.30 hours

Thursday, December 22, 2011

నీ కోసం - గజల్

ఓలలాడె నోయి ఈ రేయి నీకోసం
పరిమళాలు పానుపులేసెనోయి నీకోసం

పల్లవించే పాటనేదో పాడాలని
రాగమేదో ఆలపిస్తుంటాను ప్రతి క్షణం నీకోసం

మనసులో మాలలల్లిన మాటలన్నీ
గుండెగదిలో దాచిపెడుతుంటాను నీకోసం

వెలుగువాకిట ఎదురు చూసిన క్షణములన్నీ
ప్రభాసిత కాంతికై పరితపిస్తాను నీ కోసం

చిగురుకొరికిన కోకిల పలుకులన్నీ
కొమ్మ కొమ్మనడిగి పదిలపరుస్తుంటాను నీ కోసం

కలలుకన్న కళ్ళన్నీ మదినిలిపి
హృదయవాకిలినెపుడో  తెరచివుంచాను నీ కోసం

Tuesday, December 20, 2011

కలిసావులే! - గజల్

ఎడబాటు యెరుగని కాలమై కలిసావులే!
తడబాటు తెలియని భావమై కలిసావులే!

పూలకోసం పూదోటను వెదికేవేళ
పూలవనాన గుబాళించిన పరిమళమై కలిసావులే!

పురివిప్పిన మనసు నాట్యమాడేవేళ
పులకరించిన కలలరూపమై కలిసావులే!

దిగులు కమ్మి లోగిళ్ళు కన్నీరైన వేళ
అందుకున్నస్నేహహస్తమై కలిసావులే!

నడుస్తున్న దారిలో పడిలేస్తున్న వేళ
బ్రతుకునిచ్చే జీవనపరమార్థమై కలిసావులే!

వెలితి వెలితి జీవితాన నే ఓడిన వేళ
ప్రేమనెరిగి పాడుకునే 'విజయ'గీతమై కలిసావులే!

పండగే కదా!


హృదయాలు       నిండుగా    ఉన్నవేళ    పండగే కదా!
జీవితాన     కలలుపండగా    జరుపుకొనేది     పండగే కదా!
   
అనాధలైన     జీవితాలు     ఆరుబయట     నిదురిస్తే 
గజగజ     వణికే చలికి     దుప్పటవ్వడం     పండగే కదా!
  
వెన్నెలలు    చూడని     చీకటి      బ్రతుకుల్లో
వెలుగుల    రేఖలు    వెలిగించడం     పండగే కదా!
   
   
చీకటద్దుకున్న      మోమున    నిరాశల      జీవనాన
నేనున్నానని      చేయూత     నివ్వడం     పండగే కదా!

వినువీధుల్లో     ఎగిరిన     ఝండా      రెపరెపలు
నిరుప్రేద      బ్రతుకుల్లో     వికసించడం     పండగే కదా!   
   
వీధివీధిన      తిరిగే     అనాధ      పిల్లలకు
బడికినడిపే     పుస్తకాల    సంచవ్వడం     పండగే కదా 
   
ఆకలితో      అలమటించే     అన్నార్తుల    జీవనాన
ఓరోజు     పసందైన     భోజనమవ్వడం     పండగే కదా 

 వేవేల    తెలుగు      పాటల     పూదోటలో
జాను '     తెనుగుపాటల      మాలవ్వడం     పండగే కదా!

Wednesday, December 14, 2011

చెబుతుంది - గజల్




నీవు ఖాళీచేసిన కుర్చీ ఏదో చెబుతుంది
నీవు పంచిన మాటల మూటలే విప్పుతుంది

బెదురు బెదురుగా ఆఫీసున అడుగెడ్తే
నేనున్నానని నీవిచ్చిన భరోసాయేదో చెబుతుంది

జీవితమైనా కాగితమైనా స్వచ్చమైనదంటూ
విప్పిచెప్పిన గీతలలోని రాతలనేవో చెబుతుంది

పరిచయాలు పెరిగిన పనిదారుల్లో
ఆకలిగమనించి పంచుకున్నదేదో చెబుతుంది

కలతచెందిన మనసు కన్నీరయితే
వెన్నుచరిచి వూతమిచ్చిన వైనమేదోచెబుతుంది

ఎవరొచ్చి ఆక్రమిస్తారోననే దిగులు
అలజడై పెరిగే గుండె ధ్వనిదేదో చెబుతుంది

నీవొదిలిన కుర్చీ భర్తీ అవ్వొచ్చేదో రోజు
ఎన్నటికీ నా మదీ నిండని వెలితేదో చెబుతుంది 


( This ghazal for నిషిగంధ నిషి
ప్రక్క కుర్చీలోని సహోద్యోగి వేరే ఉద్యోగానికి వెళ్ళితే కాళీ అయిన కుర్చిని చూస్తే గుర్తొచ్చే, మిస్సయ్యే అంశాలు  )

Thursday, December 8, 2011

అందంగా వుంటావులే - గజల్


ఏ రూపులో చూసినా అందంగా వుంటావులే
నీవుచేసే ఏ పనిలొనైనా అందంగా వుంటావులే

తెరతీసిన ఆకాశంక్రింద నిదురపొద్దుల కసువులూడుస్తూ
అహ్వానించే తొలికిరణంకన్నా అందంగా వుంటావులే

బహుళ అంతస్థుల భవనాలలో పూలకుండిలు సాగుచేస్తూ
పూయించిన పూలగుత్తులకన్నా అందంగా వుంటావులే

దమ్ముచేసిన మడులలో వడివడిగా నాట్లేస్తూ
వూడ్చిన నారుమడులకన్నా అందంగా వుంటావులే

త్రోవ తప్పి బెదరిపోయిన చిన్నారిని బుజ్జగిస్తూ 
ఓదార్చిన లేతబుగ్గకన్నా అందంగా వుంటావులే

చీకటి రెక్కలుచాపి దుప్పటి పరిచేవేళలో
వెలిగించిన దివ్వెవెలుగుకన్నా అందంగా వుంటావులే

అనురాగపు సిరులునింపి మమతల లాలింపులతో
కనిపెంచిన అమ్మకన్నా అందంగా వుంటావులే

నినువర్ణించేందుకు ప్రణమిల్లే  పదాలకూర్పుల్లో
జానురాసిన పాటకన్నా నీవే అందంగా వుంటావులే