Tuesday, February 12, 2013

నేస్తమా - రుద్రారం శ్రీనివాస రెడ్డి,

రుద్రారం శ్రీనివాస రెడ్డి, 9704743805

గులాబీల సొగసుజూసి మోహపడకు నేస్తమా
ముళ్ళుకూడ ఉంటాయని మరిచిపోకు నేస్తమా

తళుకులీను మెరుపులెల్ల పసిడికాంతి కాదు సుమా
మధురపిలుపు వలపనుకొని మదనపడకు నేస్తమా

నివురుకింద నిప్పుకణిక లుంటాయని మరవకు
మది చదువని మగువకోరి తపన పడకు నేస్తమా

ఎండమావి నీరనుకొని ఎదురేగిన వ్యర్థమే
హృదికరగని కాంతకొరకు విలపించకు నేస్తమా

అందలేని ఫలమునెపుడు ఆశించకు శ్రీనివాస
శృతికలపని నాతి కోరి భంగ పడకు నేస్తమా


------------------------------------

నెలవంక నెమలీక సౌజన్యంతో

Sunday, February 3, 2013

నీ కోసం - జగన్నాద వడిమెళ్ళ


మనసుమాట మగరాజ తెలుసుకో నీ కోసం
మదిరాజ్యాన్ని మహారాజా ఏలుకో నీ కోసం

కన్నుల్లోని కలలు. బుగ్గల్లోని కెంపులు.
పెదాల ఎరుపులు ఎదలో మమతలు..నీ కోసం

తనువు తహతహలు తలపు తలగడలు
వలపు వింజామరలు ప్రాయపు పకపకలు..నీ కోసం

నదుల గలగలలు జతుల లయతళాలు
శబ్దాల తరంగాలు గతుల గమకాలు..నీ కోసం

పైటల విసురులు సోకుల సొబగులు..నీ కోసం
పయ్యెదల పిలుపులు సోయగాల సకిలింపులు..నీ కోసం

రూప విలాసాలు దీప కాంతిరేఖలు.
ధూప పరిమళాలు మది మురిపాలు..నీ కోసం

హృదిలో సరాగాలు కళ్ళల్లో మెరుపులు
తరుణి తమకాలు. గదిలో పాలగ్లాసు..నీ కోసం

వయసు దివిటీలు మనసు మతాబులు
వెన్నెల వెలుగులు చెలిమి చిచ్చుబుడ్డీలు..నీ కోసం

చెవుల లోలకులు ముక్కున ముక్కెరలు.
కొప్పున కొండమల్లెలు నడుము నయగారాలు..నీ కోసం

జాబిలి పాడిన జావళి జామురాతిరి జాగారం
జలధి అందించే ముత్యాలు జవ్వని మదన సింగారాలు..నీ కోసం

ముద్దుకో ముద్దు మమతల సద్దు
పసిడికిరణాల పొద్దు సమాజాంక్షలు రద్దు..నీ కోసం

నా మది నీదని నీకింత అలుసా
విసురజ మనసులోని మాటలమూత నీ కోసం

**********
జగన్నాద వడిమెళ్ళ - గీతాంకు - ఘజల్ రూపం

Wednesday, January 23, 2013

గజలౌతుంది - అద్దేపల్లి రామ్మోహన రావు




అద్దేపల్లి రామ్మోహన రావు


మనసున చేరిన ఆత్మయే గజలౌతుంది
ఆగక రగిలే దుఃఖమే గజలౌతుంది

వేదన తడిలో కలలే కరిగిన రాతిరి
హృదయము పగిలే ప్రళయమే గజలౌతుంది

మౌనముగా మదిలోపల దాగిన వలపే
తనువును రేగిన జ్వాలయే గజలౌతుంది

ఒంటరిగా క్షణములే జారే దారిలో
వెలుగై నిలిచే దీపమే గజలౌతుంది

జనము లోపలనైనా తనకు తానైనా
ఉండుంది ఏడ్చే ఏడుపే గజలౌతుంది


courtesy :
http://www.koumudi.net/Monthly/2013/january/index.html


Saturday, November 24, 2012

ఉందో లేదో స్వర్గం


రచన : తటపర్తి రాజగోపాలన్

గానం : గజల్ శ్రీనివాస్

ఉందో లేదో స్వర్గం నా పుణ్యం నాకిచ్చెయ్
సర్వస్వం నీకిస్తా నాబాల్యం నాకిచ్చెయ్

అమ్మ గుండెలోదూరి ఆనందంతో తుళ్ళి
ఆదమరచి నిదరోయే ఆ సౌక్యం నాకిచ్చెయ్

కేరింతలతో కుదిపి బుల్లిబొతలు తడిపి
ఊయల కొలువులు ఏలే ఆ రాజ్యం నాకిచ్చెయ్

చెత్తను వేసెబుట్ట ఆట సామను పుట్ట
విరిగినవన్నీ నావే నా మాన్యం నాకిచ్చెయ్

అమ్మ లాలనకు ముందు బ్రహ్మ వేదాలుబందు
ముక్తికేలనే మనసా బాల్యంకోసం తపస్సుచెయ్

సూచిన వన్నీ కోరుతూ ఏడుస్తుంటే రాజా
అమ్మ పెట్టిన తాయిలం ఆ భాగ్యం నాకిచ్చెయ్

Thursday, November 22, 2012

ఉదయా'నందం - ఘజల్


ఉదయ్ కుమార్ 



ప్రేమ ఇంత మధురమని తెలిసింది నిన్ను నేడు కలిసాక
నిర్మలంగా ఉంది చూడు ఆకాశం వాన కాస్త వెలిసాక

అహం పొరలు కమ్మితే మంచేది మరి చెడ్డేది
మానవత్వం పరిమళించదా సోహం అంటే తెలిసాక

ఎవరెస్ట్ ఎక్కినా సరే దొరకని అపరిమితానందం ఎక్కడ
కన్నతల్లి కళ్ళల్లో కొడుకు ప్రయోజకుడయ్యాడనే మెరుపు మెరిసాక

కల్లబొల్లి కబుర్ల బాతాఖానీలకే కన్నె పిల్లలు కరుణించేది
కనబడరు బాబూ కంటికి కాస్త ఆ ముచ్చటేదో మురిసాక

పొద్దస్తమానం పనికిమాలిన రాతలతో ఎందుకీ ' ఉదయా'నందం
పరవశించదా మది రసజ్ణుల ప్రశంసల జల్లులో నిలువెల్లా తడిసాక


Sunday, September 30, 2012

ఎలా మరవడం






తనువంతా మేఘమై తడిపిన కాలాన్ని ఎలామరవడం ?
జ్ఞాపకమైన రాగమేదో పదేపదే వినబడితే ఎలామరవడం?

కరుణించే కన్నుల్లో కదలిసాగిన అలలన్నీ
కాగితపు పడవలైన బాల్యపు అడుగులన్నీ ఎలా మరవడం?

వల్లప్పల పాటలలో కలిసి ఆడిన స్నేహహస్తం
సవ్వడిచేసే గానమై వెనువెంటే రావడం ఎలా మరవడం?

చిరుజల్లులలో ఏరిన ముత్యాల చినుకులు
చెలిచెక్కిలిపై నడయాడి మెరవడం ఎలా మరవడం?

సంధ్యకెదురైన చుట్టం వాలుసంధ్యలో వర్షం
రాత్రి విడువని జ్ఞాపకమై వేకువకెటోవెళ్తే ఎలా మరవడం?

తడిపొడి చినుకుల్లో తడబడు అడుగుల్తో
కదిలే పాలరాతి శిల్పాన్ని మరిపించడం ఎలా మరవడం?

ఉరిమిన ఉరుములలో భయపెట్టిన జాడలు
ఎదిగిన వయసునేర్పిన ధైర్యపు మూటలు  ఎలామరవడం!

కలలాగా సాగిన మబ్బులవెంట పయననం
"జాను"పాడేగీతికల్లో మురిసిన అనుభవాన్ని ఎలా మరవడం?

Friday, September 21, 2012

సురేష్ వంగూరీ || గజల్... నేనేనా

సురేష్ వంగూరీ || గజల్... నేనేనా

తన ఊహే ఊరటగా శ్వాసిస్తూ నేనేనా
తన ప్రేమే బాసటగా భాసిస్తూ నేనేనా

ఉరుకులుగా ఊసులన్ని కుమ్మరించి పోతుంది
తీరికగా ఒక్కొక్కటి ధ్యానిస్తూ నేనేనా

మురిపెంగా కోపిస్తూ మృదువుగా నను తోస్తుంది
ఒకే స్పర్శ వంద సార్లు అనుభవిస్తూ నేనేనా

ఒక్క చిన్న మాట కూడా ఓర్వలేని ముక్కోపిని
చిత్రంగా ఓరిమిలో రాణిస్తూ నేనేనా

ఎంత మారిపోయావో తెలుస్తోంది వంగూరీ
తన కోసం తనలాగా పరిణమిస్తూ నేనేనా

21. 9. 2012