Tuesday, December 6, 2011

అమ్మమనసు - గజల్



* * *

పండువెన్నెల కన్నా చల్లనిది అమ్మమనసు

నిండు జగమంతా ఎరిగినది అమ్మమనసు

గోరుముద్దలు తినిపిస్తూ చందమామచూపిన
మురిపాల మీగడ పాల బువ్వైనదీ అమ్మమనసు

బుడిబుడి అడుగులకు చూపుడు వ్రేలునిచ్చి
వడివడిగా పథాలలోకి నడిపినదీ అమ్మమనసు

భాను కిరణాలతో ఉదయరాగ మాలపించి
ధాత్రికే సహనం నేర్పినదీ అమ్మమనసు

జగతిని మమతల నెలవుల కాంతులలో
జ్యోతియై కరిగికరిగి వెలుగునిచ్చినదీ అమ్మమనసు

అనుబంధాలు పెనవేసే జాడల జాతరలో
సువాసనల గంధమై పరిమళించినదీ అమ్మమనసు

పద్మాలు వికసించే శరత్ చంద్రకాంతిలో
స్వాతి ముత్యమై మెరిసినదీ అమ్మమనసు

ప్రేమనెరిగిన శ్యామాక్షరాల యింటిలో
సిరులనిచ్చే శ్రీ నివాసమైనదీ అమ్మమనసు

విజయ పథాన నేను నడువగా
లోకాన ప్రవీణతలో నడిపినదీ అమ్మమనసు

నేర్చిన జ్ఞానంతో పయనించే మార్గంలో
వెలలేని అపరంజి అయినదీ అమ్మమనసు

తీపితీపి జ్ఞాపకాలు జగమంతా తెలిపే
యెదను పలికే సుధలు నింపినదీ అమ్మమనసు

కనిపెంచిన పిల్లలు తనయెదుటే ఎదిగి
వృక్షాలై నీడనిస్తుంటే సంతశించేదీ అమ్మమనసు

శృతిచేసిన రాగం ప్రీతిమీర ఆలపించే
"జాను''తెలుపు నాల్గుమాటలలో ఇమడనిదీ అమ్మమనసు
************

నిద్రపట్టిని ఓరాత్రి
నెట్టు అందుబాటులేనప్పుడు
ఏదో చదువుతుంటే
ఒక లైనుతో ప్రారంబమై ఇలా వచ్చింది

ఇందులో ఫేసుబుక్కు గ్రూపులలో తరచూ కలిసేవారి పేర్లు ఇమడటం యాదృశ్చికం