Thursday, November 14, 2013

గజల్ ఫైజ్ రాసిన ఉర్దూ పంక్తులు



...............Abd Wahed

ఈ రోజు మొదటి కవిత ఒక గజల్. గజల్ నిబంధనలను పాటిస్తూ అనువదించాలనుకోవడం ఒక పెద్ద సాహసమే అవుతుంది. అయినా ఫైజ్ రాసిన ఈ గజల్ ను సాధ్యమైనంత వరకు గజల్ ప్రక్రియలోనే అనువదించడానికి ప్రయత్నించాను. గజల్ లోని శబ్ధమాధుర్యం కూడా భావానికి బలాన్నిస్తుంది.

కష్టాలకు వివరణలూ లేనేలేవు కదా
మనోవ్యధకు సాంత్వనలు లేనే లేవు కదా

మరోసారి వాగ్దానం నిలబడనే లేదు
మరోసారి మాట నిజం కానేలేదు కదా

అమరత్వపు అనుమతులు పురుగులకూ లేవు
దీపాలకు ఒక్కరాత్రి రానేలేదు కదా

మత్తు రుచికి ముందే మనసు ఎగసిపడుతోంది
పరాకాష్ఠ ఈ గోష్ఠిలొ పలకనె లేదు కదా

తపిస్తున్న కళ్లముందు ఒక్కచూపు మెరిసి
కలవలేని రాత్రి గడిచి పోనేలేదు కదా

వ్యాజ్యాల ద్వారాలూ మూతపడే వేళ
మొత్తుకోళ్ళ నోళ్ళు మూత పడనె లేదు కదా

ప్రతిరోజూ ఫైజ్ నీకు కాళరాత్రి కదా
ఒక్కసారి పరిహారం దొరకనె లేదు కదా

ఫైజ్ రాసిన ఉర్దూ పంక్తులు

షరహ్ బేదర్దీ హాలాత్ న హోనే పాయీ
అబ్ కే భీ దిల్ కీ ముదారాత్ న హోనే పాయీ

ఫిర్ వహీ వాదా జో ఇక్రార్ న బన్ నే పాయా
ఫిర్ వహీ బాత్ జో అస్ బాత్ న హోనే పాయీ

ఫిర్ వో పర్వానే జిన్హే ఇజ్నే షహాదత్ న మిలా
ఫిర్ వో షమేం కె జిన్హే రాత్ న హోనే పాయీ

ఫిర్ వహీ జాం బల్బీ లజ్జత్ మై సు పహలే
ఫిర్ ఓ మహ్ఫిల్ జో ఖరాబాత్ న హోనే పాయీ

ఫిర్ దమ్ దీద్ రహే చష్మ్ ఓ నజర్ దీద్ తలబ్
ఫిర్ షబ్ వసల్ ములాఖాత్ న హోనే పాయీ

ఫిర్ వహాం బాబ్ అసర్ జానియే కబ్ బంద్ హో
ఫిర్ యహాం ఖతమ్ మనాజాత్ న హోనే పాయీ

ఫైజ్ సర్ పర్ జో హర్ ఇక్ రోజ్ ఖయామత్ గుజరీ
ఎక్ భీ రోజ్ మకాఫాత్ న హోనే పాయీ