Saturday, March 22, 2014

పని ఏమిటి - Abd Wahed



ప్రశ్నలే లేనప్పుడు జవాబుతో పని ఏమిటి
దారులే లేనప్పుడు గమ్యంతో పని ఏమిటి

ముక్కలై పోయినపుడు కంటిలోని అలలన్నీ
చెంపపై జారుతున్న నవ్వులతో పని ఏమిటి

చుక్కలను సిగపూలుగ తురుముకున్న రాత్రుల్లో
చీకటే నెచ్చెలియ వెలుగులతో పని ఏమిటి

పల్చనై పోతుంటే అనురాగం మనసుల్లో
మౌనమే బాగున్నది రాగాలతో పని ఏమిటి

గుండెలో ఇరుకైతే ఉండాలా అందులోనె
ప్రాణమే గడ్డకడితె నెత్తుటితో పని ఏమిటి

పూలపై పేరుకున్న మంచులోని సుగంధాలు
గాలిలో లేనప్పుడు ఊపిరితో పని ఏమిటి

మంచులా కరుగుతున్న దారుల్లో జారుతుంటె
పచ్చిగా మొలకెత్తే ప్రేమలతో పని ఏమిటి