Sunday, November 3, 2013

ఒంటరిగానే...పెన్నాశివరామకృష్ణ - గజల్,





నీడల నుంచీ నీ కన్నీటిని దాచుకునే రోదించాలి
ఒంటరిగానే దీపాలన్నీ ఆర్పుకునే రోదించాలి

గాయాలను నీ అతిథులుగా ఎపుడూ సంభావించుకొని
అతిథుల నందరినీ హృదయానికి హత్తుకునే రోదించాలి

జీవన దేవత కొక హారం కానుక ఇవ్వాలనుకుంటే
అశ్రువులను మరుమల్లెల మాలగ కూర్చుకునే రోదించాలి

గాయాలన్నీ సులోచానాలై లోకం తీరును తెలిపాయి
గాయం కూడా మనిషికి వరమని తెలుసుకునే రోదించాలి

దేహంతోనే దహనం అయ్యే రహస్య వేదన వేధిస్తే
నే హృదయాన్ని నీవే కౌగిలించుకునే రోదించాలి

ఆనందం మూయించిన కనులను, అశ్రువులే తెరిపించేది.
పవిత్ర గ్రంథంగా ప్రతి అశ్రువునూ మార్చుకునే రోదించాలి

ప్రతి వేదనకూ కారణమడిగే లోకంతోనే చిక్కంతా
ఎవరికి వినబడకుండా, పెదవులు మూసుకునే రోదించాలి

గాయపడడమే వ్యసనమైతె విలపించకురా " పెన్నా "
చెరగని గాయపు మరకను నిత్యం నిమురుకునే రోదించాలి

పాడలేని పాట.......పెన్నాశివరామకృష్ణ





పాడలేని పాట పదును ముల్లైపోయింది
నీవు లేని బతుకు కలత నిదురై పోయింది

దూతగ నా మనసునేల పంపితినో కాని
తిరిగి రాక నీ సిగలో విరియై పోయింది

నిన్ను చూడరాలేదని అంత కోపమేలా?
నీవు పయనమైన గడియె సిలువై పోయింది

మల్లెలుగా కురులలోన ముడుచుకుంటివేమో !
నా నింగిని ఒక్క తార కరువై పోయింది

నిద్ర రాని రాత్రి ఏ కావ్యమో చదువబోతే
ప్రతి పుట నీ ఛాయాచిత్రమై పోయింది

బాధ కూడ బహుమతి కద "పెన్నా" ఈ వేళ !
చెలి వేసిన శిక్ష నేడు గజలై పోయింది

మోహాన్ని పెంచే ముద్దు కంటే.....పెన్నాశివరామకృష్ణ - గజల్





దూరాలు పెంచే వెలుగు కంటే చీకటే ఎంతో నయం
హృదయాన్ని కోసే మాట కంటే మౌనమే ఎంతో నయం

శిశిబింబమూ నా చెలియ లాగే ఎపుడు ఏ కళనుండునో ?
బహురూపి యగు జాబిల్లి కంటే తారలే ఎంతో నయం

చురకత్తులకు మరు రూపమేమో తెలుసుకొని చేయందుకో
గో రూపి యగు పులి చెలిమి కంటే, వైరమే ఎంతో నయం

ఎన్నెన్ని గోడలు, ముళ్ళ కంచెలు తీరునా భూ దాహము!
ధనికునకు సొత్తగు పుడమి కంటే గగనమే ఎంతో నయం

మమకారమును రుచి చూపి ప్రేయసి పయనమైనది ఎచటికో ?
మోహాన్ని పెంచే ముద్దు కంటే గాయమే ఎంతో నయం

ఏ మందు లేనిది ప్రేమ జబ్బని తెలిసె "పెన్నా" నేటికి
లోలోన కాల్చే ప్రేమ కంటే మరణమే ఎంతో నయం