Tuesday, December 20, 2011

కలిసావులే! - గజల్

ఎడబాటు యెరుగని కాలమై కలిసావులే!
తడబాటు తెలియని భావమై కలిసావులే!

పూలకోసం పూదోటను వెదికేవేళ
పూలవనాన గుబాళించిన పరిమళమై కలిసావులే!

పురివిప్పిన మనసు నాట్యమాడేవేళ
పులకరించిన కలలరూపమై కలిసావులే!

దిగులు కమ్మి లోగిళ్ళు కన్నీరైన వేళ
అందుకున్నస్నేహహస్తమై కలిసావులే!

నడుస్తున్న దారిలో పడిలేస్తున్న వేళ
బ్రతుకునిచ్చే జీవనపరమార్థమై కలిసావులే!

వెలితి వెలితి జీవితాన నే ఓడిన వేళ
ప్రేమనెరిగి పాడుకునే 'విజయ'గీతమై కలిసావులే!

పండగే కదా!


హృదయాలు       నిండుగా    ఉన్నవేళ    పండగే కదా!
జీవితాన     కలలుపండగా    జరుపుకొనేది     పండగే కదా!
   
అనాధలైన     జీవితాలు     ఆరుబయట     నిదురిస్తే 
గజగజ     వణికే చలికి     దుప్పటవ్వడం     పండగే కదా!
  
వెన్నెలలు    చూడని     చీకటి      బ్రతుకుల్లో
వెలుగుల    రేఖలు    వెలిగించడం     పండగే కదా!
   
   
చీకటద్దుకున్న      మోమున    నిరాశల      జీవనాన
నేనున్నానని      చేయూత     నివ్వడం     పండగే కదా!

వినువీధుల్లో     ఎగిరిన     ఝండా      రెపరెపలు
నిరుప్రేద      బ్రతుకుల్లో     వికసించడం     పండగే కదా!   
   
వీధివీధిన      తిరిగే     అనాధ      పిల్లలకు
బడికినడిపే     పుస్తకాల    సంచవ్వడం     పండగే కదా 
   
ఆకలితో      అలమటించే     అన్నార్తుల    జీవనాన
ఓరోజు     పసందైన     భోజనమవ్వడం     పండగే కదా 

 వేవేల    తెలుగు      పాటల     పూదోటలో
జాను '     తెనుగుపాటల      మాలవ్వడం     పండగే కదా!