Thursday, April 17, 2014

ఆ వెన్నెల...కన్నెగంటి వెంకటయ్య -గజల్



ఆ వెన్నెల వెలుగును చూసి ఎంతగా మురిసిపోతిని..!?
ఈ వన్నెల తెలుగును చూసి అంతగా మురిసిపోతిని..!!
//ఆ వెన్నెల//

తెలుగు చంద్రకళలను సాంతం పరభాషా రాహువు పట్టి
నమిలి మింగె తీరును చూసి ఎంతగా కుమిలి పోతిని.
//ఆ వెన్నెల//

సహజ తెలుగు వెన్నెల ముందు కృత్రిమ వెలుగులు నిలబడవని
గ్రహించని ద్రోహుల చూసి ఎంతగా రగిలి పోతిని.
//ఆ వెన్నెల//

తెలుగు జాబిలమ్మకు భయపడి పరభాషాచీకటి తొలిగి
రాబోయే జిలుగును చూసి ఎంతగా ఆశపడితిని.
//ఆ వెన్నెల//

తెలుగు సూర్యపుత్రుల కాంతి తెలుగు చందమామ సజీవం
కన్నెగంటి కన్నుల చూసి ఎంతగా హర్షించితిని.
//ఆ వెన్నెల//

17.4.14.

చల్లా గజల్


ఎక్కడో చిరుజల్లు పడితే ఇక్కడెందుకు గొడుగు పడతావు
ఎక్కడో పారేటి నీటికి ఇక్కడెందుకు చాల్లు కడతావు

గాయమొకరికి వైద్యమొకరికి రోగమెప్పుడు కుదుట పడును
మనసుకే అవినీతి కుడితే మనిషికెందుకు మందు పడతావు

సొమ్ము ఒకడిది షొకు ఒకడిది దేశమెప్పుడు బాగుపడును
పొరుగునే పూరిళ్ళు ఉన్నా పరులకెందుకు మేడ కడతావు

బాధలొకరివి భాగ్యమొకరిది సమత మమతలు ఎక్కడున్నవి
ఆకలంటూ ఆర్తినొందే వారికెందుకు కడుపు కొడతావు

కలం ఒకరిది కవిత ఒకరిది మొసమైనా ఓయి "చల్లా"
కీర్తికోసం ఎన్ని జిత్తులో తెలిసి ఎందుకు బాధపడతావు

17.4.2014