Thursday, December 8, 2011

అందంగా వుంటావులే - గజల్


ఏ రూపులో చూసినా అందంగా వుంటావులే
నీవుచేసే ఏ పనిలొనైనా అందంగా వుంటావులే

తెరతీసిన ఆకాశంక్రింద నిదురపొద్దుల కసువులూడుస్తూ
అహ్వానించే తొలికిరణంకన్నా అందంగా వుంటావులే

బహుళ అంతస్థుల భవనాలలో పూలకుండిలు సాగుచేస్తూ
పూయించిన పూలగుత్తులకన్నా అందంగా వుంటావులే

దమ్ముచేసిన మడులలో వడివడిగా నాట్లేస్తూ
వూడ్చిన నారుమడులకన్నా అందంగా వుంటావులే

త్రోవ తప్పి బెదరిపోయిన చిన్నారిని బుజ్జగిస్తూ 
ఓదార్చిన లేతబుగ్గకన్నా అందంగా వుంటావులే

చీకటి రెక్కలుచాపి దుప్పటి పరిచేవేళలో
వెలిగించిన దివ్వెవెలుగుకన్నా అందంగా వుంటావులే

అనురాగపు సిరులునింపి మమతల లాలింపులతో
కనిపెంచిన అమ్మకన్నా అందంగా వుంటావులే

నినువర్ణించేందుకు ప్రణమిల్లే  పదాలకూర్పుల్లో
జానురాసిన పాటకన్నా నీవే అందంగా వుంటావులే