మధువుకే మత్తెక్కి, నాపై స్వారి చేస్తూ ఉన్నది !!
మరచిపోయిన గాథలన్నీ, తవ్వి పోస్తూ ఉన్నది !!
గొంతు దాటిన పిదపనైనా, కుదురు లేదీ మధువుకు !
అన్ని దిశలకు ఒక్కసారే పరుగు తీస్తూ ఉన్నది !!
ఉదరమును చేరిన మధువు, దాహము పెంచి వంచిస్తున్నది !
తనను తానే తాగుతూ, తాండవము చేస్తూ ఉన్నది !!
అన్ని మరిచే మత్తు కోసం, మధువు చెంతకు చేరితే,
నా వయసుతో నా ఓటములనే, హెచ్చవేస్తూ ఉన్నది !!
తొలుత బాధకు జోల పాడుతు, పిదప గాయము కెలుకుతూ,
కడకు చీకటిబావిలోనికి, తోసివేస్తూ ఉన్నది !!
బాధించు చెలియను మరచుటకు, ఈ మధువె చెలిగా మారెను !
మరిపించు నెపమున, ఆమె పేరే జపము చేస్తూ ఉన్నది !!
పెదవి దాటిన దాక అణకువ కలిగి ఉండును మద్యము !
లోనికెళ్ళి సర్వేంద్రియాలను కూలదోస్తూ ఉన్నది !!
అన్ని బాధల నుంచి ముక్తిని కోరి, తన దరి చేరినాను !
చిరుపాత్రలో బంధించి, నన్నే గేలి చేస్తూ ఉన్నది !!
మాట, మనసూ, నడక తడబడు, కడకు బతుకే తూలును !
తుదకు మధువే ఊతకర్రగ, కానిపిస్తూ ఉన్నది !!