Friday, June 15, 2012

నీకెవరు నేర్పారు?






ఆకురాలిన శిశిరానికి   కోకిలగాన మెవరునేర్పారు? 
మబ్బుకమ్మిన మనసుకు నెమలినాట్య మెవరునేర్పారు?   

ఊపిరి ఊగిసలు ఊయలూగే ఉయ్యాలలో   
స్వరగతుల వేణుగాన మవ్వడమెవరునేర్పారు 

బడికెళ్ళిన బాల్యం కన్నువిప్పిన వేళలో 
సొగసులెరిగి సిగ్గు మొగ్గవ్వడమెవరు నేర్పారు 

తూలిపోయే నడకనేర్చిన జీవన పథాలలో 
పదుగురెరిగే పరుగులవ్వడమెవరునేర్పారు 

దిక్కులెటు కనిపించని దృక్కులన్నిటిలో  
మదినిండిన సిరులవానలో తడవడమెవరునేర్పారు 

పదనిసలు తెలియని పదాల రాగలలో
జానుతెలునుగు పాటై ప్రవహించడం నీకెవరునేర్పారు?   


-----------------------------------------------------
జాన్ హైడ్ కనుమూరి

Sunday, June 10, 2012

మిత్రమా!!! - గజల్ కోదండ రావు గారి రచన


 ఈ గజల్ కోదండ రావు గారి రచన 
 వారి బ్లాగు నా కవిత

అందనిదేదో అందుతుందని అపేక్షించకు మిత్రమా!!!
అందినదాన్ని అందుకునేందుకు ఉపేక్షించకు మిత్రమా!!!

ఒరుసుకుందని రాళ్ళమద్యన ఏటిపయనం ఆగునా
దాతలకోసం చేతులుచాచి నిరీక్షించకు మిత్రమా!!!

సమ్మెటేస్తే బండరాయిలే ముక్కలవ్వక ఆగునా
మాటి,మాటికి మనసునైనా పరీక్షించకు మిత్రమా!!!

తాడుతోటి బిగించి లాగితే కొండకుదురులు వచ్చునా
ప్రజ్ఞలేని ప్రయత్నమెప్పుడు సుభీక్షించదు మిత్రమా!!!

చేదుగుళికలు ఎన్నిమింగిన చెదరకోయ్ 'కోదండ'
గడచిపోయిన పీడకలలను సమీక్షించకు మిత్రమా!!!
*****


వారి బ్లాగు 
http://www.naa-kavitha.blogspot.in/