Wednesday, August 22, 2012

సురేష్ వంగూరీ || గజల్... యుద్ధం



నీలోపల నీ పైనే యుద్ధం చేయాలి
నీవేంటో మరి నీకే అర్ధం చేయాలి

అహం అస్తమిస్తేనే అసలు సిసలు ఉదయంరా
తడి తెలియని హృదయాలను చిధ్రం చేయాలి

చరితంటే కాలాలూ రాజ్యాలూ యుద్ధాలా
గెలిపించిన గాయాలను భద్రం చేయాలి

నిలవున్డిన విలువలను నినదించకు వంగూరీ
ప్రవహించే ప్రశ్నలతో శుభ్రం చేయాలి

Monday, August 20, 2012

కోదండరావు - గజల్




ఏ నాటకమైనా ముగిసిందా ఏదో వాదన లేకుండా!!!
ఏ జీవితమైనా గడిచిందా ఏదో వేదన లేకుండా!!!

కలల్లోనే గడిపేస్తుంటే.. కీర్తిశిఖరం అందుతుందా
ఏ దేశమైన పురోగమించిందా ఏదో సాధన లేకుండా!!!

నీళ్ళైనా నిలకడగుంటే.. రాళ్ళల్లో నాచు మొలవదా
ఏ ధర్మమైన జన్మించిందా ఏదో శోధన లేకుండా!!!

యంత్రం ఎంత గొప్పదైనా... తానుగా నడవదులే
ఏ పాపడైనా పుడతాడా ఏదో దీవెన లేకుండా!!!

జాబిల్లి వెన్నెల చల్లితే...కలువ మురియదా "కోదండ"
ఏ మనసైనా ప్రేమిస్తుందా ఏదో స్పందన లేకుండా!!!

Saturday, August 18, 2012

వలపు - ఘజల్


ఈడూరి శ్రీనివాస్ 

నీ వలపు మది తాకిన సమీరం లాగుంది
ఆ తలపు నను వీడని భ్రమరం లాగుంది

నీ చూపు తాకగానె శిలనైన నాకు
కన్ను కన్ను కలపడమే సమరం లాగుంది

ప్రేమ అనే పదానికి ఇంత పటిమ ఎక్కడిదో 
ఆ ఊహే వేసవిలో శిశిరం లాగుంది

ఎంత కాదన్నా నీ వెంటే నడుస్తున్నా 
నీ తీరే అసమ్మతి శిబిరం లాగుంది

ఇన్ని నెలల నిరీక్షణ ముగిసేనా తొందరలో 
నీ వాలుచూపు ప్రేమాలయ శిఖరం లాగుంది

చెరిగిపోని ప్రణయాలు చరిత్రలో ఎన్నున్నా
ఈడూరీ, నీ కధ అమరం లాగుంది