Sunday, September 30, 2012

ఎలా మరవడం






తనువంతా మేఘమై తడిపిన కాలాన్ని ఎలామరవడం ?
జ్ఞాపకమైన రాగమేదో పదేపదే వినబడితే ఎలామరవడం?

కరుణించే కన్నుల్లో కదలిసాగిన అలలన్నీ
కాగితపు పడవలైన బాల్యపు అడుగులన్నీ ఎలా మరవడం?

వల్లప్పల పాటలలో కలిసి ఆడిన స్నేహహస్తం
సవ్వడిచేసే గానమై వెనువెంటే రావడం ఎలా మరవడం?

చిరుజల్లులలో ఏరిన ముత్యాల చినుకులు
చెలిచెక్కిలిపై నడయాడి మెరవడం ఎలా మరవడం?

సంధ్యకెదురైన చుట్టం వాలుసంధ్యలో వర్షం
రాత్రి విడువని జ్ఞాపకమై వేకువకెటోవెళ్తే ఎలా మరవడం?

తడిపొడి చినుకుల్లో తడబడు అడుగుల్తో
కదిలే పాలరాతి శిల్పాన్ని మరిపించడం ఎలా మరవడం?

ఉరిమిన ఉరుములలో భయపెట్టిన జాడలు
ఎదిగిన వయసునేర్పిన ధైర్యపు మూటలు  ఎలామరవడం!

కలలాగా సాగిన మబ్బులవెంట పయననం
"జాను"పాడేగీతికల్లో మురిసిన అనుభవాన్ని ఎలా మరవడం?

Friday, September 21, 2012

సురేష్ వంగూరీ || గజల్... నేనేనా

సురేష్ వంగూరీ || గజల్... నేనేనా

తన ఊహే ఊరటగా శ్వాసిస్తూ నేనేనా
తన ప్రేమే బాసటగా భాసిస్తూ నేనేనా

ఉరుకులుగా ఊసులన్ని కుమ్మరించి పోతుంది
తీరికగా ఒక్కొక్కటి ధ్యానిస్తూ నేనేనా

మురిపెంగా కోపిస్తూ మృదువుగా నను తోస్తుంది
ఒకే స్పర్శ వంద సార్లు అనుభవిస్తూ నేనేనా

ఒక్క చిన్న మాట కూడా ఓర్వలేని ముక్కోపిని
చిత్రంగా ఓరిమిలో రాణిస్తూ నేనేనా

ఎంత మారిపోయావో తెలుస్తోంది వంగూరీ
తన కోసం తనలాగా పరిణమిస్తూ నేనేనా

21. 9. 2012