పెన్నాశివరామకృష్ణ
నా హృదయమను రహదారి మీదుగ నడచి వెళ్ళింది!
తన నీడ నెందుకొ ? ఇచటనే దిగ విడిచి వెళ్ళింది!
పగడమై తన వేలిపై, నే మెరవ దలచాను
శ్మశానంలో దిష్టిబొమ్మగ నిలిపి వెళ్ళింది!
చూడ దలచితె వేగ రమ్మని లేఖ రాసింది
తన ఇంటిదాకా ముళ్ళ మఖ్ మల్ పరచి వెళ్ళింది!
కాంక్ష, కర్మకు మూలమను భావాన్ని నిరసించి
ప్రేమయే నిష్కామ కర్మని తెలిపి వెళ్ళింది !
గజలుతో నా చెలికి పోలిక చెప్పుటే నేరం!
గజలుతోనే బతకమని జత కలిపి వెళ్ళింది!
రమ్మనుటకో, పొమ్మనుటకో తెలియనే లేదు
తలుపు లెందుకొ? సగం మాత్రమె తెరిచి వెళ్ళింది!
courtesy : http://www.facebook.com/shivaramakrishna.penna?fref=ts