Friday, June 14, 2013

గజల్ - varchaswi.laxman

 .......................
:గజల్:
.......................

రెండు పాదాలు కలుపుకుంటే ఒక ‘శేరు’గా రావాలి
గజల్లో మొదటి షేరు పేరైన ‘మత్లా’గా రావాలి

మత్లా లో ప్రతిపాదానికి అంత్యపదమే ‘రదీఫ్’
అర్ధమున్న ఏకాక్షరమో, పదమో రదీఫులుగా రావాలి.

మిగతా శేరుల్లో మొదటి పాదమెలాగున్నా
రెండో పాదాంతం ఖచ్చితంగ రదీఫుగా రావాలి.

నాలుగు మించి శేరులెన్నొ గజల్లో జోడించు
ఆఖరి శేరు మటుకు మనం పిలుచుకునే ‘మఖ్తా’గా రావాలి.

మఖ్తా మొదటి పాదం చివరి పదం చూడు చిత్రంగా
ఏమేమో కాదది నీ నామమె - అది ‘తకల్లుఫ్’గా రావాలి.

ఇక గజల్లో సౌందర్యం చెప్పవేమి వర్చస్వీ
ప్రతి రదీఫు ముందు అక్షరమో పదమో ‘కాఫియా’గా రావాలి.

............ధన్యవాదాలు....................
http://www.facebook.com/varchaswi.laxman

Tuesday, June 11, 2013

యశస్వి రాసిన యు బెండ్ - కవితకు గజల్ రూపం




కొండవాలు దారి మలుపులో ఎదురెదురు ప్రయాణాల్లో తలతిప్పి చూసా
బ్రతుకుబండి బయటేకదా నీ చూపులు చివరిసారిగా మెలేసాయని చూసా.

విడివిడిగానైతేనేం ఒక్కదిక్కుకే పోతున్నామనుకున్నా
నువ్వావైపు నేను ఈవైపని గుర్తించేలోగా కనుమరుగయ్యావని చూసా

చేతుల్లో మిగిలిందల్లా గుప్పిట నిండిన గుండె సలపరమే
ఆలోచనంతా తిరుగుప్రయాణం మీదే క్షణమైనా మళ్ళీ కలుస్తామాని చూసా

నే పైకి నువ్వు కిందకీ చూపులకందకుండా ఏమిటీ రాకపోకలు
మలుపులే తప్ప మజిలీలు లేవు మరోక్షణం తట్టుకోవడమెలానని చూసా

ఎక్కడ ఆగాలో ఎంతకాలమిలా సాగాలో! తెలిసేదెలా!!
యసస్వినిలిచిన బాటలో నిలిచి కలలరాణివై ఎదురొస్తావని చూసా!


----
Original Poem

యశస్వి  || యూ బెండ్ ..||

కొండవాలు దారి మలుపు లో
ఎదురెదురు ప్రయాణాల్లో
తలతిప్పి చూసా..

బ్రతుకు బండి బయటేకదా!
నీ చూపులు నన్ను..
చివరిసారిగా.. మెలేసాయి.

విడివిడిగానైతేనేం
ఒక్కదిక్కుకే
పోతున్నామనుకున్నా..

నువ్వు పైకి.. నేకిందకీ
అని గుర్తించేలోగా
కనుమరుగయ్యావు..

చేతుల్లో మిగిలిందల్లా..
గుప్పిట నిండిన..
గుండె సలపరమే

ఇక ఆలోచనంతా
తిరుగుప్రయాణం మీదే..
ఒక్క క్షణమైనా..మళ్ళీ కలుస్తామా!!

నే పైకి.. నువ్వు కిందకీ..
కంటిచూపులకందకుండా..
ఏమిటీ రాకపోకలు..

మలుపులే తప్ప
మజిలీలు లేవు..
తట్టుకోవడమెలా!!

ఎక్కడ ఆగాలో..
ఎంతకాలం ఇలా సాగాలో!
తెలిసేదెలా!!

==11.06.2013==

Saturday, June 8, 2013

ఎలామరవడం!

తనువంతా మేఘమై తడిపిన కాలాన్ని ఎలామరవడం!
జ్ఞాపకమైన రాగమేదో పదేపదే వినబడితే ఎలామరవడం!

కరుణించే కన్నుల్లో కదలిసాగిన అలలన్నీ
కాగితపు పడవలైన బాల్యపు అడుగులన్నీ ఎలామరవడం!

వల్లప్పల పాటలలో కలిసి ఆడిన స్నేహహస్తం
సవ్వడిచేసే గానమై వెనువెంటే రావడం ఎలామరవడం!

చిరుజల్లులలో ఏరిన ముత్యాల చినుకులు
చెలిచెక్కిలిపై నడయాడి మెరవడం ఎలామరవడం!

సంధ్యకెదురైన చుట్టం వాలుసంధ్యలో వర్షం
రాత్రి విడువని జ్ఞాపకమై వేకువకెటోవెళ్తే ఎలామరవడం!

తడిపొడి చినుకుల్లో తడబడు అడుగుల్తో
కదిలే పాలరాతి శిల్పాన్ని మరిపించడం ఎలామరవడం!

ఉరిమిన ఉరుములలో భయపెట్టిన జాడలు

ఎదిగిన వయసునేర్పిన ధైర్యపు మూటలు  ఎలామరవడం!

కలలాగా సాగిన మబ్బులవెంట పయననం
‘జాను’పాడేగీతికల్లో మురిసిన అనుభవాన్ని ఎలామరవడం!


.............................................జాన్ హైడ్ కనుమూరి 
http://koumudi.net/Monthly/2013/may/index.html