Friday, May 9, 2014

"తెలుగు గజళ్ళు, రుబాయీలు - స్థితి గతులు"



పెన్నాశివరామకృష్ణ 
(ఒకటవ భాగం)
(సూచన :- తెలుగులో గజళ్ళు రాసే వారికి కొన్ని సూచనలు, సలహాలు ఇస్తే బాగుంటుందని గౌరవనీయులైన మిత్రులు అబ్దుల్ వాహెద్ గారు అన్నారు. నాకు అలాంటి శక్తి, సామర్థ్యాలు లేఫు. నేను కూడ విద్యార్థినే. అయినా కొన్ని అభిప్రాయాలను మిత్రులతో పంచుకోవడం కోసమే ఈ ప్రయత్నం. నేను రాసిన "తెలుగు గజళ్ళు, రుబాయీలు" (తెలుగు విశ్వ విద్యాలయ ప్రచురణ, 2012) అనే పుస్తకంలోని "తెలుగు గజళ్ళు, రుబాయీలు - స్థితి గతులు" అనే అధ్యాయం లోని కొన్ని భాగాలను ఇక్కడ పొందుపరుస్తున్నాను. ఇక్కడ చర్చించే అంశాలన్నీ నాకు ("పెన్నా" కు) కూడ వర్తిస్తాయని గమనించగలరు. ఇక్కడ చర్చించబోయే అంశాలకు ఒకటి రెండు అపవాదాలు ఉండవచ్చు. మిత్రులందరూ నా అభిప్రాయాలలోని గుణ దోషాలను చర్చించ గలరని ఆశిస్తాను.)
1966 సం|| ప్రాంతంలో దాశరథి గారు తొలి గజళ్ళను రుబాయీలను రాశారు. నాటి నుంచి నేటి వరకు వచ్చిన తెలుగు గజళ్ళ, రుబాయీల సంపుటాలను పరిశీలిస్తే--వాసి పరంగానూ, రాశి పరంగానూ నిరాశే మిగులుతుంది. తెలుగు ప్రధాన సాహిత్య స్రవంతిలో కూడ ఈ ప్రక్రియల పట్ల తగిన గౌరవాదరాలు లేవు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. తెలుగులో వచన కవిత్వమే ప్రధాన కవితా ప్రక్రియ. మిగిలిన సమాంతర కవితా ప్రక్రియలన్నీ ప్రయోగాలే. కొన్ని సమాంతర కవితా ప్రక్రియల వస్తు రూపాలు వివాదాస్పదమైనవి. గజల్, రుబాయీలు కూడ తెలుగులో సమాంతర కవితా ప్రక్రియలే. అందులోను ఇవి గేయ కవితలు కావడం, నిర్దిష్ట సామాజిక అంశాలను, సంచలనాలను చిత్రించడానికి వీలు లేకపోవడం, ఇవి చమత్కార ప్రధానమైనవి కావడం మొదలైన అంశాలు కూడ, ఈ ప్రక్రియల పట్ల అనాదర భావానికి కారణాలు. తెలుగులో బాగా పేరు పొందిన కవులెవరూ (దాశరథి, సి.నా.రె.లను మినహాయిస్తే) ఈ ప్రక్రియల జోలికి రాకపోవడానికి ఇతరేతర కారణాలతోపాటు, పైన పేర్కొన్నవి కూడ ప్రధాన కారణాలుగా భావించవచ్చు.
ఒక ప్రక్రియకు కాని, ఒక రచనకు కాని తగిన ఆదరణ లభించ్లేదంటే -- అందుకు రచయితలోని, లోపాలూ, దోషాలూ, రచనలోని బలహీనతలే ముఖ్య కారణాలుగా భావించాలి.
పరభాషకు చెందిన ప్రక్రియలను స్వీకరించి, తమ మాతృభాషలో ఆ ప్రక్రియలకే పేరు తెచ్చిన కవులూ, రచయితలందరూ, ఆయా పరభాషా సాహిత్యాలలోని నిర్దిష్ట ప్రక్రియలలో వచ్చిన రచనలను అధ్యయనం చేశారు. (సంస్కృతంలోని పురాణ ఇతిహాసాది ప్రక్రియలను తెలుగులో వెలయించిన ప్రాచీన కవుల నుండి, ఆంగ్ల సాహిత్యం నుంచి అరువు తెచ్చుకున్న ప్రక్రియలలో అమోఘమైన రచనలు చేసిన ఆధునిక తెలుగు రచయితల వరకు దీనిని అన్వయించుకోవచ్చు.) దాశరథి, సి.నా.రె. గార్లకున్న ఉర్దూ నేపథ్యం అందరికీ తెలిసిందే.
తెలుగులో గజళ్ళు రాస్తున్న వారికి సి.నా.రె. గారి గజళ్ళు, తెలుగులో రుబాయీలు రాస్తున్న వారికి దాశరథి గారి రుబాయీలు ఆదర్శమైనాయి. మాత్రా ఛందస్సులలో ఎన్నెన్నో ప్రయోగాలు చేసిన, ఉర్దూ గజల్ తత్వం తెలిసిన సి.నా.రె. గారే గజల్ కు అవినాభావమైన నియమ నిబంధనలను "తెలుగు గజళ్ళ" (1986) లో ఉపేక్షించారు. "సి.నా.రె. గజళ్ళు" పేరుతో ఆ తర్వాత వారు రాసిన గజళ్ళలో, గతంలో ఉపేక్షించిన చాల అంశాలను గుర్తించి సవరించుకున్నారు. "నా తొలి గజళ్ళలో నేను అనుసరించిన విధానాలను, స్వీకరించిన స్వేచ్చను కొలమానాలుగా చేసుకొని ఆ ఒరవడిలో గజళ్ళు కూర్చాడు" (2005) అని ఒక గజల్ సంపుటికి రాసిన ముందుమాటలో సి.నా.రె. గారే పేర్కొన్నారు. ఈ మాటలలోని వ్యంగ్యం గుర్తించదగినది. సి.నా.రె. గారి పై మాటలు, తెలుగు గజల్ కవుల అధ్యయన పరిమితులను కూడ పరోక్షంగా తెలుపుతాయి.
  
 (రెండవ భాగం )
దాశరథి గారు రాసిన పది, పదకొండు గజళ్ళలోనూ, అన్ని నియమాలు పాటించబడినవి మూడు లేదా నాలుగు గజళ్ళు మాత్రమే. దాశరథి గారు రుబాయీల రచనలోనూ "స్వేచ్ఛ" తీసుకున్నారు. తొలి తెలుగు గజళ్ళలోని, రుబాయీలలోని లోపాలు ఆ తర్వాత తరంవారి రచనలలోను కొనసాగాయి; నేటికీ కొనసాగుతున్నాయి. "శ్రేష్ఠులు" గా పేరుపొందినవారు అనుసరించిన విధానాలే "ఇతరుల" కు ఆదర్శమవుతాయి కదా! మలి తరం తెలుగు గజల్, రుబాయీల రచయితలు నేరుగా ఉర్దూ గజళ్ళనూ, రుబాయీలనూ కొంత వరకైనా అధ్యయనం చేసి ఉంటే, తొలి తరం రచయితలు తీసుకున్న స్వేచ్చలోని సామంజస్య, అసామంజస్యాలు తెలిసేవి. తమ రచనలను మరింత నిర్దుష్టంగా తీర్చి దిద్దుకోవడానికి వీలయ్యేది.
"Poets unfamiliar with traditional Ghazals should learn as much as they can about the form in its original cultures and poets who produced Ghazals" అంటూ ఒక ఆంగ్ల విమర్శకుడు, ఆంగ్ల గజల్ కవులకు సూచించాడు. అన్ని భాషలలో గజళ్ళు, రుబాయీలు రాస్తున్న, రాయదలచినవారు గమనించి తప్పక అనుసరించవలసిన ముఖ్య అంశమిది.
(ఉర్దూ గజళ్ళను, రుబాయీలను అధ్యయనం చెయ్యాలంటే ఉర్దూ భాష నేర్చుకోవాలి కదా! ఉర్దూ భాష నేర్చుకోవాలంటే అరబిక్ లిపి నేర్చుకోవాలి కదా! ఇంత కష్టపడాలా? అని మన తెలుగు కవులకు అనిపించవచ్చు. కాని అరబిక్ లిపి నేర్చుకోకుండానే ఉర్దూ గజళ్ళను చదివి, విని ఎంతో కొంత అర్థం చేసుకొని ఆనందించడానికి కూడ అనేక మార్గాలున్నాయి. అసలు తెలుసుకోవాలన్న కోరిక, పట్టుదల ఉండాలి కదా! ఏ కొంచెమైనా శ్రమ పడకుండా ఏదీ సాధ్యం కాదు కదా!)
తెలుగు సాహిత్య విమర్శకులైన కొందరిలో సత్యనిష్ఠ కొరవడడమూ, తెలుగు గజళ్ళ (రుబాయీల) గురించి రాసిన విమర్శకులు కూడ, ఆ ప్రక్రియల నేపథ్యాన్ని, మౌలిక స్వరూప స్వభావాలను గూర్చి అధ్యయనం చేయకపోవడమూ, ఆ ప్రక్రియల మీద వచ్చిన ఇతర తెలుగు విమర్శ రచనల మీదనే ఆధారపడడమూ -- మొదలైనవి తెలుగు గజళ్ళలో తగినంత పరిణతి లేకపోవడానికి పరోక్ష కారణాలు.

 ( మూడవ భాగం)
తెలుగు గజళ్ళ (రుబాయీ) లలో కనిపించే ప్రధాన లోపాలనూ దోషాలనూ, వాటికి కారణాలనూ చర్చించుకుందాం !
1. గజల్ (రుబాయీల) లోని రదీఫ్, కాఫియాలు, చమత్కార ప్రాధాన్యం అనేవి చిత్రపటానికి ఉండే చట్రం (ఫ్రేమ్) లాంటివి. రదీఫ్, కాఫియాలే వర్ణచిత్రం కాదు. ఆ ఫ్రేమ్ మధ్య ఏ రకమైన వర్ణ సమ్మేళనంతో, ఏ కొత్త పద్ధతిలో, ఏ అంశాన్ని, ఎంత అందమైన, ఎంత గంభీరమైన చిత్రంగా తీర్చి దిద్దగలడనేది, ఆ కవి ప్రతిభ, అధ్యయన, అభ్యాసాల మీద ఆధారపడి ఉంటుంది.
రదీఫ్, కాఫియాలూ, షేర్ లోని పాదాల (మిస్రాల) మధ్య ఉండవలసిన భావైక్యతా, ఎన్నుకున్న ఛందస్సును ఆద్యంతం సక్రమంగా పాటించడమూ, చమత్కారం కలిగించడమూ -- అనే చట్రాన్ని నిర్దుష్టంగా అనుసరించని కవికి ఆ చట్రం పట్ల గౌరవం లేదనీ లేదా ఆ చట్రంలో అందమైన చిత్రాన్ని గీయలేని శక్తి హీనుడనీ భావించాల్సి వస్తుంది. ఈ చట్రాన్నీ , ఈ నియమాలనూ ఇరుకుగానో, ఇబ్బందిగానో, అసౌకర్యంగానో భావించి, తమకు వీలైన పద్ధతిలో రాయాలనుకున్నప్పుడు, అలాంటి రచనలకు వేరే పేరు పెట్టుకోవచ్చు. నిర్దిష్ట నియమాలను పాటించకుండా గజల్ (రుబాయీ) అనే పేరును ఉపయోగించుకోవడం అంటే -- అసమర్థతతో ఆత్మ వంచనకూ, ఉద్దేశ్యపూర్వకంగా పరవంచనకూ సిద్ధపడడమే. వందలాది సంవత్సరాల నుండి, వేలాది మంది ఉర్దూకవులు గౌరవించి పాటించిన నియమాలు, ఆంధ్రేతర భాషలలోనూ, ఇంగ్లిష్ లోనోప్ గజళ్ళు రాస్తున్న కవులు విధిగా పాటిస్తున్న నియమాలు, కొందరు తెలుగు కవులకు అసౌకర్యంగా అనిపిస్తున్నాయంటే, అది తమ బలమా? బలహీనతా ? అనేది వారే ఆలోచించుకోవాలి.
 
Top of Form
Bottom of Form
 (నాలుగవ భాగం)
2. మత్లా లోనైనా, షేర్ లలోనైనా, రెండు పాదాల మధ్య భావైక్యం ఉండాలి. అంటే రెండూ ఏకాంశ బోధకాలై ఉండాలి. తెలుగు (గజళ్ళ) మత్లాలలోని రెండు పాదాలూ (చాలావరకు) రెండు వేరు వేరు భావాంశాలుగానే కూర్చబడుతున్నాయి. ఇతర షేర్ లు కూడ అలాగే ఉంటున్నాయి. మత్లా లోని రెండు పాదాలలో, షేర్ లలోని రెండవ పాదంలో రదీఫ్, కాఫియాలను పాటిస్తే గజలైపోతుందని చాలామంది తెలుగు గజల్ కవులు భావిస్తున్నట్లు కనిపిస్తున్నది.
మరో ముఖ్యాంశం, రదీఫ్, కాఫియాలు కలిసిపోకూడదు. రదీఫ్, కాఫియాతో సంబంధం లేని విడి పదమై ఉండాలి. "పాడుకుంటాను", "ఆడుకుంటాను", "చేరుకుంటాను" లాంటి మాటలను పాదాల చివర ఉపయోగిస్తే, అది అంత్య ప్రాస మాత్రమే అవుతుంది. రుబాయీలలో కూడ 1,2,4 పాదాలలో రదీఫ్, కాఫియాలను పాటించాలి. రదీఫ్, కాఫియాలు గజళ్ళకు సంబంధించినవేననీ, రుబాయీకి అంత్య ప్రాస సరిపోతుందనీ కొందరి భావన. (నాకు తెలిసినంత వరకూ) అది సరి కాదు.

 (ఐదవ భాగం)
3. తెలుగు గజళ్ళ (రుబాయీల) లో తగిన స్థాయిలో చమత్కారం ఉండడం లేదు. చమత్కారం లేని ఏ గజల్ (రుబాయీ) అయినా, ఒక సాధారణ గేయం (ముక్తకం) అవుతుంది కాని గజల్ (రుబాయీ) అనిపించుకోదు.
ఎన్ని రకాల అర్థాంతరాలను స్ఫురింపజేస్తుందనే అంశం మీదా, ఎన్ని రకాలుగా బహుళ అన్వయాలకు అనుకూలమైనదనే దాని మీదా, "చమత్కారం" లోని తర తమ భేదాలు ఆధారపడి ఉంటాయి. ఒక నిర్దిష్టమైన వస్తువుకూ, లేదా ఒకానొక వాక్య నిర్మాణ వ్యూహానికీ పరిమితమైన "చమత్కారం" కంటే, సార్వకాలికంగా, సార్వదేశికంగా వర్తించే విషయాన్ని ధ్వనించే "చమత్కారం" ఉత్తమమైనదిగా భావించవచ్చు.
4. గేయాత్మకత లోపించడం చాల తెలుగు గజళ్ళ (రుబాయీల) లో కనిపించే మరో సాధారణ (అవ) లక్షణం. చాల మంది మలి తరం తెలుగు గజల్ కవులు (నాతో సహా), గజల్ తోనే గేయ రచన ఆరంభించిన వారూ, తత్పూర్వం గేయ రచనలో అనుభవం లేనివారూ, మాత్రా ఛందస్సులను గూర్చీ, "గతుల" ను గూర్చీ తమ అవగాహనను పెంచుకోడానికి కూడ గజల్ కవులు ప్రయత్నిస్తున్నట్లు కనిపించదు. మాత్రా గణాల సమతనూ, నిర్దిష్ట గతులనూ అనుసరించడం లేదు. తమ గాన నైపుణ్యంతో, "మాత్రల" లోని హెచ్చు తగ్గులను గాయకులు మరుగు పరచగలరు. ఆ గజళ్ళను చదువుతున్నప్పుడు చదువరికి నిర్దిష్టమైన "లయ" స్పురించదు. ( అందుకే "గజల్ శ్రోతకు మాత్రమే కాదు, చదువరికీ ఆనందం కలిగించాలి" అనే అంశాన్ని డా. సదాశివ గారు పదే పదే గుర్తుచేస్తుండే వారు.)
 (ఆరవ భాగం)
౫. తాము ఎవరిని లక్ష్యంగా చేసుకొని గజళ్ళు రాస్తున్నమనే విషయంలో కొందరు కవులకు స్పష్టత ఉన్నట్లు లేదు. గాయకుల అభిరుచుల మేరకు, 'సగటు' ప్రేక్షక శ్రోతల మెప్పు కోసం కొందరు గజళ్ళు రాస్తున్నారు.రాసుకోవచ్చు. తప్పేం లేదు. కాని అవే గజళ్ళను పుస్తకంగా అచ్చువేసినప్పుడు ఇబ్బంది ఎదురవుతున్నది. గజలుకున్న ప్రత్యేకతలు కాని, కనీసం 'గజలు' పేరు కాని తెలియని ప్రేక్షక శ్రోతలకు అది గజలు అయినా మరొకటైనా (వారికి) తేడా ఏమీ తెలియదు. సెంటిమెంటుతో కూడిన వస్తువు వల్ల, 'జనరంజక' ధోరణుల వల్ల ప్రేక్షక శ్రోతలు ఆనందించవచ్చు. అభిరుచులూ, అవగాహనా స్థాయీ, కవిత్వానుభవాల దృష్ట్యా, సగటు ప్రేక్షక శ్రోతలకూ, సాహిత్య పాఠకులకూ మధ్య అంతరముంటుంది. ప్రేక్షక శ్రోతలకంటే, సాహిత్య పాఠకులకు గజల్ ప్రక్రియను గూర్చిన అవగాహన ఎక్కువగా ఉంటుంది. అందువల్ల, ప్రేక్షక శ్రోతలను దృష్టిలో ఉంచుకొని రాయబడిన గజళ్ళు సాహిత్య పాఠకులను మెప్పించలేకపోతున్నాయి. (ఈ అంశం తెలుగు రుబాయీలకూ వర్తిస్తుంది.)
౬. దాశరథి, సి.నా.రె. మోడ్లినవారికి, గజళ్ళ రచనకు ప్రేరణ నిచ్చినవీ, అభివ్యక్తి నైపుణ్యాన్ని అలవరచుకోడానికి తోడ్పడినవీ ఉర్దూ గజల్లే. ఉర్దూ గజళ్ళను చదివి విని కొంత వరకైనా అర్థం చేసుకోగలిగితే, ప్రతీకాత్మకంగా, ధ్వనిమంతంగా, వివిధ భావాలను స్పురింపజేసె నైపుణ్యం అలవడుతుంది. రదీఫ్, కాఫియాల ప్రయోగాలలోని వైచిత్రి, వైవిధ్యం, మంచి గజల్ రూపొందడంలో ఎలా సహాయపడతాయో తెలుస్తుంది. ఒక భావాన్ని, ఒక షేర్ లో వీలైనంత క్లుప్తంగా, చమత్కారకరంగా చెప్పడానికి అనుసరించవలసిన భాషాపరమైన పాద నిర్మాణ పరమైన కొత్త కొత్త వ్యూహాలూ బోధపడతాయి. చాలామంది తెలుగు కవులు, ఈ రకమైన అధ్యయన ఆవశ్యకతను గుర్తించకపోవడం వల్ల అభివ్యక్తిలో పరిణతిని సాధించలేకపోతున్నారు.
౭. ఉర్దూలో ప్రధాన కవితా ప్రక్రియ గజల్. గజళ్ళూ, రుబాయీలూ తెలుగులో సమాంతర కవితా ప్రక్రియలు మాత్రమే. తెలుగులో గజళ్ళు రాస్తున్న వారెవరో ఈ ప్రక్రియలకే అంకితమైనవారు కారు. దాశరథి, సి.నా.రె. గార్లతో సహా--ఇతర సాహిత్య ప్రక్రియలలో రచనలు చేస్తూ, గజల్ (రుబాయీ) రచనను ఒక ప్రయోగంగా మాత్రమే స్వీకరించారు. కొందరు నేడు గజల్, రుబాయీల రచనను సరదాగా తీసుకుంటున్నారు అన్నా తప్పు లేదేమో! కవుల అధ్యయన పరిమితులకూ, గజల్ (రుబాయీ) రచనకు తగిన శక్తి యుక్తులను సమకూర్చుకోలేకపోవడానికీ ఈ "ప్రయోగ" ధోరణి కూడ ఒక ముఖ్య కారణం. రుబాయీకి సంబంధించి దాశరథి, తిరుమల శ్రీనివాసాచార్యులు తప్ప, గజల్ కు సంబంధించి సినారె, పెన్నా శివరామకృష్ణలు తప్ప, తక్కిన గజల్, రుబాయీ కవులందరూ ఒకే ఒక్క సంపుటి ప్రచురించి సరిపుచ్చుకున్నవారే అన్నది ఇక్కడ గమనించాలి. 

 (ఏడవ భాగం)
8. వచన కవిత్వంతో పోల్చుకుంటే, సమాంతర కవితా ప్రక్రియలలో రచనలు చేసే వారి సంఖ్య తక్కువగా ఉంటుంది. కనుక అల్ప సంఖ్యాకులు రాసే ప్రక్రియలలో రచనలు చేస్తే తొందరగా గుర్తింపు వస్తుందని కొందరు భావిస్తున్నారు. తగిన అధ్యయనమూ, సాధనాలేని ఔత్సాహికులూ, కవిత్వాన్ని కాలక్షేప సాధనంగా భావించే వారు కూడ, గజల్, రుబాయీ కవులమనిపించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. (ఇతర సాహిత్య ప్రక్రియలలో వలెనే) సునాయాసంగా, అనాయాసంగా కీర్తిని పొందాలనుకునే వారు కొందరు గజల్, రుబాయీల పేర్లతో రచనలు చేస్తున్నారు. తాము రాసిన వాటిలో ఒకటి, రెండు గజళ్ళను గాయకులు పాడినా తమ పేరు పది "మందికీ" తెలుస్తుంది కదా అని మరికొందరు ఔత్సాహికులు రాస్తున్నారు. ఇలాంటి వారెవరూ తమ జ్ఞాన పరిధులను పెంచుకోడానికి ప్రయత్నిస్తున్నట్లు తోచదు. వీరిలో'ఉత్సాహం' పాలే ఎక్కువ.
9. సెంటిమెంట్ తోకూడిన వస్తువుల మీదనే రాస్తూ ఉండడమూ, ఊహలలోనూ,భావాలలోనూ నవ్యత లేకపోవడమూ, ప్రబోధాత్మకత పెరగడమూ, ధ్వని కంటే వాచ్యత ప్రధానం కావడమూ, తెలుగు గజళ్ళ (రుబాయీల)లలోని గుర్తించదగిన అంశాలు. ఇలాంటి అనేక కారణాల వల్ల, ఉర్దూ గజళ్ళ (రుబాయీల)ను చదివి, విని అర్థం చేసుకొని ఆనందించగలిగిన వారి దృష్టిలో తెలుగు గజళ్ళు పరిహాస పాత్రమవుతున్నాయి.
"గజల్ ని ఇతర భాషల (పర్షియన్ ఉర్దూయేతర) వారు 'సంస్కరించి'. 'సమకాలీనం' చేసి, అందులో సామాజిక విమర్శనూ, అభ్యుదయ భావాలనూ రంగరించి అందిస్తున్నారు. అవి బాగుండవచ్చును. కానీ నిఖార్సయిన గజల్ కలిగించే హృదయ స్పందనను అవి ఏనాటికీ కలిగించలేవన్నది నా అనుభవం." అని డా. సి. మృణాలిని గారు విస్పష్టం చేశారు.
కేవలం సాహిత్య పరమైన గుర్తింపు కోసం రాసే ప్రక్రియ కాదు గజల్. మనసు ఉపరితలంలో తేలిన భావాలను ఎవరి మెప్పుకోసమో గుదిగుచ్చితే ఆ గజల్ ఏ అనుభూతినీ కలిగించలేదు. "గాయపడని గుండెలో గజల్ మొలవదు." అనీ " గజల్ రాసే కవి గాయపడిన గుండె కలవాడై ఉండవలె." అనీ డా.సామల సదాశివ గారు పదే పదే నొక్కి చెప్పారు.ఉర్దూ మహాకవుల వ్యక్తిగత జీవితాలను పరిశీలిస్తే వారి గజల్లలోని భావగాంభీర్యానికీ, తాత్వికతకూ నేపథ్యం తెలుస్తుంది. గజల్ రాయడంకోసం ఏ "కత్తి" కో ఎదురెళ్ళి గాయపడనక్కరలేదు. వ్యక్తిగత, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ స్థితిగతుల వల్ల, ఎంతో కొంత మానసిక సంఘర్షణలను అనుభవించని వ్యక్తులు సాధారణంగా ఉండరు. కాని లౌకిక వ్యాపకాల, ఆరాటాల సాలెగూళ్ళలో చిక్కుకొని, ఆ సంఘర్షణలనూ, గాయాలనూ గుర్తించరు. తమ 'గాయాల'కు కారణాలనూ, తమ 'గాయాల'లోతునూ గుర్తించి సచైతన్యంగా అనుభవించిన వ్యక్తికి -- వ్యక్తిగత జీవితానికీ లోకానికీ మధ్య సామరస్య వైమనస్యాల, మిత్ర శత్రు వైరుద్ధ్యాల ఎరుక కలుగుతుంది; తత్వం బోధపడుతుంది. ఆ 'గాయం' కలిగించే దుఃఖంనుంచి తనకు తాను సాంత్వన చేకూర్చుకొని, గజల్ రాయడాని ప్రయత్నించినప్పుడు, జీవన సంఘర్షణ స్వరూపమూ, ఫలితాలూ అనుభవంలోకొస్తాయి.ఆ మానసిక స్థితి నుంచే అచ్చమైన గజల్ ఉద్భవిస్తుంది. ఇది నా (పెన్నా) వ్యక్తిగత అభిప్రాయం.

 (ఎనిమిదవ భాగం)
"గాయా"నికి "దర్ద్" ను పర్యాయ పదంగా భావిస్తే -- ఏదో ఒక విషయంలో, ఏదో ఒక జీవన పార్శ్వంలో తీవ్రమైన బాధను అనుభవించిన వారందరూ "దర్దీ"లే. హృదయంలో అవ్యక్తమైన సంఘర్షణ, బాధ కలిగిన ప్రతి వ్యక్తీ "దర్దీ" యే. అయితే తమను తాము "దర్దీ"గా గుర్తించగలిగిన వారి సంఖ్య తక్కువగానే ఉంటుంది. ఈ "గాయమే", ఈ బాధే తత్త్వ దృష్టిని ప్రసాదిస్తుంది.
"only those should be considered truly qualified to compose Ghazals or narrate
 the story of love. Who, in addition to being possessed of poetic powers, give word to their own emotions, write about has really transpired in their, and write only what they have personally felt"
ప్రసిద్ధ ఉర్దూ సాహిత్య విమర్శకులు అందలీబ్ షాదానీ చెప్పిన పై మాటలు ఉత్తమ గజల్ కవికి ఉండవలసిన రెండు లక్షణాలను (యోగ్యతలను) వ్యంగ్యం చేస్తున్నాయి.ఒకటి : "దర్దీ" కాని వాడు, లేదా తనలోని "దర్దీ"ని గుర్తించనివాడు ఎంత కవిత్వ రచనా శక్తి కలిగినవాడైనా మంచి గజల్ రాయలేడు. రెండు : ఎంత తీవ్రమైన మానసిక గాయాలకు గురి అయిన వ్యక్తి అయినా, రచనకు అవసరమైన నిపుణతలను సచైతన్యంగా అలవరచుకోకపోతే , సాధన చేయకపోతే మంచి గజల్ రాయలేడు.
కేవలం రదీఫ్, కాఫియాలను పాటించడమే గజల్ అనుకునే వారూ, వాచ్యార్థంలో నాసిరకపు చమత్కారమే ముఖ్యమనుకునే వారూ, 'గజల్' పేరే తెలియని, మధ్యతరగతికి చెందిన గృహిణుల, గృహస్తుల (సాహిత్యపరంగా నిరక్షరాస్యుల) కరతాళధ్వనులే లక్ష్యంగా భావించేవారూ ఎన్నటికీ "మంచి" గజల్ రాయలేరు.
గజల్, రుబాయీల పట్ల నిజమైన గౌరవం, అభిమానం కలిగిన కవులు -- పై అంశాలన్నీ దృష్టిలో ఉంచుకొని, "సూక్తులకు రుబాయీలను వాడుకోవాలి, గజళ్ళను కాదు." అని డా. సామల సదాశివ గారు చెప్పిన మాటలలోని అంతరార్థాన్ని గ్రహించి, మరింత భావగాఢతతో, చమత్కారకరమైన అభివ్యక్తితో, భావగాంభీర్యం కలిగిన ధ్వన్యాత్మకమైన గజళ్ళు, రుబాయీలు రాయగలిగితే -- ఇకముందు అయినా ఈ ప్రక్రియలకు తెలుగు సాహిత్యంలో తగిన గౌరవం చేకూరుతుంది.
----- సమాప్తం ----

Top of Form

Thursday, May 1, 2014

కె.కె.// ప్రేమ-గజల్//



కాదని అనగలనా...తనప్రేమే నడిపిస్తోందంటే,
కాదని అనగలనా... ఎడబాటే వేధిస్తోందంటే

చెంతలేకున్నా, వలపు సంకెలేసిందేమో,
కాదని అనగలనా... చెలిరూపం ఛేదిస్తోందంటే

ఏ మంత్రమున్నదో ఏమో... మతిపోయి తిరుగుతున్నాలే,
కాదని అనగలనా... చిరునవ్వే ఆడిస్తోందంటే

కొమ్మలూగుతున్నా, పలకరింపు లాగున్నాదే
కాదని అనగలనా... చెలిఊహే లాలిస్తోందంటే

గుండె సవ్వడైనా, కొండ పేల్చినట్టుందే,
కాదని అనగలనా... తన మౌనం కాలుస్తోందంటే

ఎదురుచూపులెన్నున్నా, గెలుపుంది 'కోదండ'
కాదని అనగలనా... నీ విరహం సుఖమేనంటుంటే
======Date: 14.02.2014
https://soundcloud.com/#kodanda-rao/love-is-divine