Wednesday, June 11, 2014

ఆ రాత్రి - జాన్ హైడ్ కనుమూరి గజల్


కలలోనైనా మెలకువనైనా గుర్తుండేదీ ఆ రాత్రి
నీతో నడచీ అలుపును మరచీ సాగినదీ ఆ రాత్రి
నిన్ను నన్నూ కలిపినదెవరో తెలిసేలోగా 
కాలం పరిచిన తిన్నెలపై వెన్నెల పరచినదీ ఆ రాత్రి
నిట్టూర్పు సెగలతో క్షణాలు యుగాలుగా
నీకై వేచివున్న మదిగదిని రెప్పవేయనిదీ ఆ రాత్రి
శిశిరానికి ఆకురాలిన కొమ్మను నేనై
పొటమరింతల చిగురుకై ప్రసవవేదనైనదీ ఆ రాత్రి
హోరు గాలిలోచిక్కి ఒంటరైన పక్షికి
దిగులుగా గుబులు గుబులుగా గడచినదీ ఆ రాత్రి
కలలుకన్న తనువున నిదురనే తరిమి
వేలవేల వీణెలు మీటిన సంగీతమైనదీ ఆ రాత్రి
ఎదురెదురు రేవులలో కలవలేని కనులుగా
దరి చేరని నది అలలపై ఊగి ఊగి సాగినదీ ఆ రాత్రి
అప్పగింతల పర్వమే తెగిన శాశ్వత బంధంగా
తలచి తలచి వర్షించే కనులతో తడిసినదీ ఆ రాత్రి
నెలరాజునిండిన తోటలో రేయంతా పాటగా
కూజానువొంపిన గజళ్ళతో కడుపు నిండినదీ ఆ రాత్రి

Tuesday, June 3, 2014

ఇందిర*గజల్




ఉదయాలను తిలకించే హృదయాలకు వందనం
హృదయాలను వెలిగించే ఉదయాలకు వందనం

స్పందించే మనసొకటే మనడానికి చాలునా
ఉదయాలను తలపించే కదనాలకు వందనం

చరితలోన గుర్తులన్ని చెరిపేస్తే చెరిగేన
కదనాలను ఎదనిలిపే నయనాలకు వందనం

అడుగులన్ని కలిసినపుడె దండుకదిలి సాగులే
నయనాలను నడిపించే పయనాలకు వందనం

నలుగురికై యోచిస్తే ముహూర్తాలు ఎందుకులె
పయనాలను ఉరికించే సమయాలకు వందనం

గళములన్ని ఒకటైతే అనురాగం ' ఇందిరా '
సమయాలను లయమయ్యే చరణాలకు వందనం

(25/6/2011) 1/6/14