నిషాకన్నుల ఈరేయి - గజల్
నిషాకన్నుల ఈరేయి తీయని గాయమేదో రేపుతున్నదోయి!
మునిపంట దాగిన మౌనమేదో ఫక్కున నవ్విపోతున్నదోయి!
ఇటునటు పరుగిడు ఆత్రాలనేత్రాలలో కరిమబ్బు కమ్ముకొస్తుంటే
కబురందేనో లేదోయని వేచివున్న చెలిమది కలతచెందుతున్నదోయి
అగరుపూల వాసనతో నిండి పరువమేదో మత్తిలుతుంటే
చిరుగాలి అలలపై ఆకులసవ్వడి నీ అడుగులై ధ్వనిస్తున్నదోయి
వేవేల దీపాలకాంతి నీవులేని వాకిట వెలవెలపోతుంటే
ఆశల ముంగిట ప్రమిదేదో వూగివూగి వెలుగుతున్నదోయి
జ్ఞాపకాలు ఒక్కుమ్మడిగా కాకరపూవత్తులై రాసులు పోస్తుంటే
"జాను" చూడు ఎటుదాగెనో నెలరేడు వెదకి వెదకి విసుగొస్తున్నదోయి!
No comments:
Post a Comment