Sunday, February 24, 2013

సమాంతర రేఖ //మీరజ్ ఫాతిమా ఘజల్ //





 కాలం నిలిపింది నను అలుపెరుగని బాటసారిని చేసి
మౌనం వుంచింది నిను కలవలేని సమాంతరరేఖను చేసి

నా గుండె నిండిన నీ తలపు ఆవిరై
ఆశ్రువులా జారింది వెచ్చగా వ్యధగా, " నను అభాగినిని చేసి "

నను నడిపించిన నీ చేయి దూరమై
ఎండమావై వెనక్కి వెళ్ళింది మెరుస్తూ మురిపిస్తూ " నను ఏకాకిని చేసి "

నా మనసును ఆవహించిన నీ వలపు
ఆశై చూపులో స్థిరించింది, నిశ్చలంగా నిరీక్షణగా " నను అనామికను చేసి "

నా అందమైన ఊహాలోకం నుండి నీ
స్వప్నం కరిగిపోతుంది, కాలుతూ జారుతూ " నను అవివేకిని చేసి "

నా అపురూప చెలిమి తరువునుండి నీ
స్నేహఫలం రాలిపోతుంది నిష్ఫలంగా నిర్దయగా " నను నిర్భాగ్యురాలినిచేసి "

అందమైన నా జీవన బాటలో నీ రాక మెరుపులా
మెరిసి మాయమైంది నీడలా నిరాశలా " నను అభిసారికను చేసి "

మానసిక మైదానంలో ఏకాగ్రతను వెతుకుతూ
చూపు చెదిరిపోతుంది,అలలా ఆవిరిలా " నను తాపసిని చేసి "

నా జీవితాన్ని నడిపించిన నీ జ్ఞాపకం
నిన్నలో నిలుస్తుంది, మసగ్గా మాయగా " నను నిరాధారిని చేసి "



*******
కొన్ని సార్లు మనం రాసి వాటిలో అన్నీ మనకే తెలియకోవచ్చు చదువుతున్న పాఠకునికి కొత్త కొత్త రూపాలు, భావనలు కలగొచ్చు. అలాగే ఇది కవిత అని రాసారు, కాని ఇది ఘజల్ రూపమని నాకు అనిపించి ఇలా మీముందుకు

Thursday, February 14, 2013

బోసినవ్వు - కె. కె - గజల్,


బోసినవ్వు విసురుతాడు, మంచు కురిసినట్లుగా,
చిన్నిముద్దు చిలుకుతాడు,మనసు తడిసినట్లుగా,

విరిగినవి, చిరిగినవి పారేస్తుంటే,
భద్రంగా దాస్తాడు, నిధులేవో దొరికినట్లుగా,

అరచేతిని ఆకుచేసి, అన్నం పెడుతుంటే,
నలుమూలల తిరుగుతాడు, తననెవరో తలచినట్లుగా,

ముద్దు,ముద్దు మాటలతో కధలే చెబుతుంటే,
ప్రశ్నలెన్నో అడుగుతాడు, నా మనసే అలసినట్లుగా,

నా చేతిని ఊతచేసి, నడిపిస్తుంటే,
పరుగులు పెడుతుంటాడు, జగమంతా గెలిచినట్లుగా,

అందమైన అల్లరితో అలరిస్తుంటే,
కలుసుకో కోదండ, నీ బాల్యం పిలిచినట్లుగా 

Tuesday, February 12, 2013

నేస్తమా - రుద్రారం శ్రీనివాస రెడ్డి,

రుద్రారం శ్రీనివాస రెడ్డి, 9704743805

గులాబీల సొగసుజూసి మోహపడకు నేస్తమా
ముళ్ళుకూడ ఉంటాయని మరిచిపోకు నేస్తమా

తళుకులీను మెరుపులెల్ల పసిడికాంతి కాదు సుమా
మధురపిలుపు వలపనుకొని మదనపడకు నేస్తమా

నివురుకింద నిప్పుకణిక లుంటాయని మరవకు
మది చదువని మగువకోరి తపన పడకు నేస్తమా

ఎండమావి నీరనుకొని ఎదురేగిన వ్యర్థమే
హృదికరగని కాంతకొరకు విలపించకు నేస్తమా

అందలేని ఫలమునెపుడు ఆశించకు శ్రీనివాస
శృతికలపని నాతి కోరి భంగ పడకు నేస్తమా


------------------------------------

నెలవంక నెమలీక సౌజన్యంతో

Sunday, February 3, 2013

నీ కోసం - జగన్నాద వడిమెళ్ళ


మనసుమాట మగరాజ తెలుసుకో నీ కోసం
మదిరాజ్యాన్ని మహారాజా ఏలుకో నీ కోసం

కన్నుల్లోని కలలు. బుగ్గల్లోని కెంపులు.
పెదాల ఎరుపులు ఎదలో మమతలు..నీ కోసం

తనువు తహతహలు తలపు తలగడలు
వలపు వింజామరలు ప్రాయపు పకపకలు..నీ కోసం

నదుల గలగలలు జతుల లయతళాలు
శబ్దాల తరంగాలు గతుల గమకాలు..నీ కోసం

పైటల విసురులు సోకుల సొబగులు..నీ కోసం
పయ్యెదల పిలుపులు సోయగాల సకిలింపులు..నీ కోసం

రూప విలాసాలు దీప కాంతిరేఖలు.
ధూప పరిమళాలు మది మురిపాలు..నీ కోసం

హృదిలో సరాగాలు కళ్ళల్లో మెరుపులు
తరుణి తమకాలు. గదిలో పాలగ్లాసు..నీ కోసం

వయసు దివిటీలు మనసు మతాబులు
వెన్నెల వెలుగులు చెలిమి చిచ్చుబుడ్డీలు..నీ కోసం

చెవుల లోలకులు ముక్కున ముక్కెరలు.
కొప్పున కొండమల్లెలు నడుము నయగారాలు..నీ కోసం

జాబిలి పాడిన జావళి జామురాతిరి జాగారం
జలధి అందించే ముత్యాలు జవ్వని మదన సింగారాలు..నీ కోసం

ముద్దుకో ముద్దు మమతల సద్దు
పసిడికిరణాల పొద్దు సమాజాంక్షలు రద్దు..నీ కోసం

నా మది నీదని నీకింత అలుసా
విసురజ మనసులోని మాటలమూత నీ కోసం

**********
జగన్నాద వడిమెళ్ళ - గీతాంకు - ఘజల్ రూపం