Sunday, February 24, 2013

సమాంతర రేఖ //మీరజ్ ఫాతిమా ఘజల్ //





 కాలం నిలిపింది నను అలుపెరుగని బాటసారిని చేసి
మౌనం వుంచింది నిను కలవలేని సమాంతరరేఖను చేసి

నా గుండె నిండిన నీ తలపు ఆవిరై
ఆశ్రువులా జారింది వెచ్చగా వ్యధగా, " నను అభాగినిని చేసి "

నను నడిపించిన నీ చేయి దూరమై
ఎండమావై వెనక్కి వెళ్ళింది మెరుస్తూ మురిపిస్తూ " నను ఏకాకిని చేసి "

నా మనసును ఆవహించిన నీ వలపు
ఆశై చూపులో స్థిరించింది, నిశ్చలంగా నిరీక్షణగా " నను అనామికను చేసి "

నా అందమైన ఊహాలోకం నుండి నీ
స్వప్నం కరిగిపోతుంది, కాలుతూ జారుతూ " నను అవివేకిని చేసి "

నా అపురూప చెలిమి తరువునుండి నీ
స్నేహఫలం రాలిపోతుంది నిష్ఫలంగా నిర్దయగా " నను నిర్భాగ్యురాలినిచేసి "

అందమైన నా జీవన బాటలో నీ రాక మెరుపులా
మెరిసి మాయమైంది నీడలా నిరాశలా " నను అభిసారికను చేసి "

మానసిక మైదానంలో ఏకాగ్రతను వెతుకుతూ
చూపు చెదిరిపోతుంది,అలలా ఆవిరిలా " నను తాపసిని చేసి "

నా జీవితాన్ని నడిపించిన నీ జ్ఞాపకం
నిన్నలో నిలుస్తుంది, మసగ్గా మాయగా " నను నిరాధారిని చేసి "



*******
కొన్ని సార్లు మనం రాసి వాటిలో అన్నీ మనకే తెలియకోవచ్చు చదువుతున్న పాఠకునికి కొత్త కొత్త రూపాలు, భావనలు కలగొచ్చు. అలాగే ఇది కవిత అని రాసారు, కాని ఇది ఘజల్ రూపమని నాకు అనిపించి ఇలా మీముందుకు

2 comments:

  1. మీరు రాసింది ఇంచుమించు గజల్ లా ఉంది , మీరు రాయగలరు అని నా చెత రాయించిన John Hyde gariki vandnaalato,

    ReplyDelete